Hyderabad: ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్న 2009–2011 ఓయూ విద్యార్థులు!

Hyderabad: మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ 2009-2011 బ్యాచ్ విద్యార్థి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఓయూ కామర్స్ కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

HARISH, TARNAKA
Published on: 16 Aug 2026 7:03 PM IST
Hyderabad
X

Hyderabad: ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్న 2009–2011 ఓయూ విద్యార్థులు!

హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ 2009-2011 బ్యాచ్ విద్యార్థి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించారు. 2009-2011 విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ కళాశాలలో పీజీ చదువుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమకారులు ఈ కార్యక్రమానికి హాజరై నాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి 2009-2011 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా సేవలందించిన ప్రొఫెసర్‌ టి. తిరుపతిరావు, అదే సమయంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పనిచేసిన ప్రొఫెసర్‌ సుదర్శన్‌రావు, ప్రొఫెసర్‌ కేశవ నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థి ఉద్యమకారులతో నాటి ఉద్యమ అనుభవాలను పంచుకుంటూ, అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఉద్యమంలో విద్యార్థుల పాత్రను కొనియాడుతూ విలువైన సందేశాన్ని అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది విద్యార్థి ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీకి తరలివచ్చారు. చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వారు ఉద్యమ కాలం నాటి అనుభవాలను పరస్పరం పంచుకొని, ఆనాటి పోరాట ఘట్టాలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారులు మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందువరుసలో నిలిచి పోరాడిన 2009-2011 కాలం నాటి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను ప్రభుత్వం అధికారికంగా ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్యమకారులకు ఏవైనా ప్రయోజనాలు కల్పించినా, ఆ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న తమకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తించి, ఉద్యమకారుల సేవలకు తగిన గౌరవం కల్పించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో డా. యుగేందర్ నాతి, డా. మంతెన సతీష్, పరశురాములు దేవులపల్లి, కుమార్, కందుల శ్రీను, కృష్ణమూర్తి, కత్తి సైదులు, రాజేష్, రాజు, వెంకట్, సుధాకర్‌తో పాటు పలువురు 2009-2011 విద్యార్థి ఉద్యమకారులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story