Ranga Reddy: అంతారం 'నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్' అవగాహన సదస్సు
Ranga Reddy: రంగారెడ్డి అంతారంలో NMNF ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం, భూసార పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సేంద్రియ పద్ధతుల ప్రాధాన్యతను రైతులకు వివరించారు.
Ranga Reddy: అంతారం 'నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్' అవగాహన సదస్సు
Ranga Reddy: కేంద్ర ప్రభుత్వ నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్.యం.ఎన్. ఫ్) కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండల అంతారం గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ పద్ధతులు, భూసార పరిరక్షణ మరియు సహజ వనరుల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి దండెం. విజయచంద్ర మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పంటల సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ప్రాధాన్యత, ప్రయోజనాలు మరియు అమలు విధానాలపై పూర్తి అవగాహన పెంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
125 మంది రైతులు ప్రకృతి వ్యవసాయానికి ఎంపిక
అంతారం గ్రామంలో 125 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం కింద ఎంపిక చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, శిక్షణ మరియు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై నిరంతర అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్రిషిసఖీలుగా జి.మాధవి, రిషితను ఎంపిక చేయడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే సహజ పద్ధతులు, స్థానికంగా లభించే ముడి పదార్థాల వినియోగం, సహజ కీటక నియంత్రణ, నేల ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ముడి పదార్థాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఘనజీవామృతం, జీవామృతం వంటి సహజ ఇన్‌పుట్‌ల తయారీ మరియు వినియోగంపై రైతులకు అవగాహన కల్పించి, అవసరమైన మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
125 మంది రైతుల నుంచి మట్టి నమూనాల సేకరణ.
ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా అంతారం గ్రామంలోని ఎంపికైన 125 మంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించడం జరిగింది. సేకరించిన మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రం, రాజేంద్రనగర్ కు పంపించి శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి వివరించారు.
భూసార పరీక్షల అనంతరం రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పొలంలో ఏయే పోషకాలు లోపించాయి, ఏ పోషకాలు సమతుల్యంగా ఉన్నాయి అనే విషయాలను గుర్తించి, అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని వివరించారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి
ప్రస్తుతం వ్యవసాయంలో విరివిగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు మరియు ఇతర రసాయన ఇన్‌పుట్‌లపై పూర్తిగా ఆధారపడకుండా, అందుబాటులో ఉన్న పశువుల వ్యర్థాలు, పంట అవశేషాలు మరియు ఇతర సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అంతారం, గ్రామ సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి శైలజ, గ్రామ రైతులు ఇడిగి చెన్నయ్య, వడ్డే నర్సింహులు, సునీత, గొల్ల జంగయ్య, చాకలి అర్చన తదితర రైతులు పాల్గొన్నారు.
రైతులు నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం ద్వారా అందిస్తున్న శిక్షణ, సాంకేతిక సూచనలు మరియు సహజ వ్యవసాయ ఇన్‌పుట్‌లను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన నేల – ఆరోగ్యకరమైన పంట – స్థిరమైన వ్యవసాయం దిశగా ముందుకు సాగాలని వ్యవసాయ అధికారి సూచించారు.




