Nagole: ప్రకృతిని ప్రేమిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: నాగోల్‌లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే పిలుపు
Nagole: హైదరాబాద్ నాగోల్‌లో ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.
Nagole: ప్రకృతిని ప్రేమిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: నాగోల్‌లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే పిలుపు
నాగోల్: పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మొక్కలు నాటారు.
నాగోల్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి పరిరక్షణ లక్ష్యాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. "ప్రకృతిని ప్రేమిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే సందేశంతో గ్రూప్ సభ్యులు చైతన్యం కల్పిస్తున్నారని ప్రశంసించారు.
గ్రూప్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు, ఆరోగ్య పరిరక్షణకు నడక ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నడక ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సభ్యులు వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ సమస్యల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్క నాటి సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించగలమన్నారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందించేందుకు ఐకాన్ వాకర్స్ గ్రూప్ నిరంతరం కృషి చేస్తోందని కొనియాడారు.
కార్యక్రమంలో ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షులు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రెటరీ రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రమేష్, జాయింట్ సెక్రెటరీ పెంటారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, సలహాదారులు ప్రతాప్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు చిరంజీవి, ఈశ్వర్ గౌడ్, సభ్యులు, సీతారాములు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




