Madhapur: మాదాపూర్‌లో మదర్ థెరిసా 'సేవారత్న' పురస్కారాల ప్రదానం!
Madhapur: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలు. పలువురు ప్రముఖులకు 'సేవారత్న' పురస్కారాలు అందజేసిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు.
Madhapur: మాదాపూర్‌లో మదర్ థెరిసా 'సేవారత్న' పురస్కారాల ప్రదానం!
Madhapur: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మాదాపూర్ లోని స్వాతి హైస్కూల్‌లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. ముందుగా మదర్ థెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి ఘనంగా అంజలి ఘటించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్‌సీయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా రాగం మల్లికార్జున యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మదర్ థెరిసా జీవితంలోని పలు అరుదైన, స్ఫూర్తిదాయకమైన కోణాలను ఆవిష్కరించి, ఆమె సేవకు ప్రతిరూపంగా వ్యాఖ్యానించారు.
మదర్ థెరిస్సా తన జీవితాన్ని పేదలు, అనాథలు, రోగుల సేవ కోసం అంకితం చేసిన ఒక గొప్ప మానవతావాది అని ఆయన వివరించారు "మానవ సేవే మాధవ సేవ" అనే సూత్రాన్ని నమ్మి, సమాజంలో అట్టడుగున ఉన్న వారి కోసం ఆమె ఎనలేని కృషి చేశారని చెప్పారు.
1950లో కేవలం 13 మంది సభ్యులతో, సాధారణ నీలం అంచు తెల్లటి చీరతో 'మిషనరీస్ ఆఫ్ చారిటీ'ని స్థాపించి, దాన్ని వందలాది దేశాలకు విస్తరించిన ఆమె ప్రయాణం అనన్యసామాన్యమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా మరణశయ్యపై ఉన్న అనాథలు, పేదలు రోడ్ల పక్కన దిక్కులేకుండా చనిపోకూడదనే ఉద్దేశ్యంతో కాళీఘాట్ లో ఆమె స్థాపించిన 'నిర్మల్ హృదయ్', అలాగే అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన 'శిశు భవన్' లాంటి సంస్థలు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనాలు" అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మదర్ థెరిస్సా సేవలను గుర్తు చేశారు.
సభాధ్యక్షత వసహించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ‘సమాజంలో మానవసేవే మాధవసేవగా భావించి వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేస్తున్న వారికి 'సేవారత్న' పురస్కారాలు అందిస్తున్నామని చెప్పారు.
మదర్ థెరిస్సా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె స్థాపించిన సంస్థల ద్వారా దయ, కరుణ, సేవాభావం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని స్వాతి హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రిక పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేషమైన సేవలందించిన కింది సేవామూర్తులకు అతిథుల చేతుల మీదుగా సేవారత్న అవార్డులను (దుశ్శాలువ, జ్ఞాపిక, పగిడి, తాంబూలంతో) సత్కరించి ప్రదానం చేశారు. శ్రీమతి ఎం. అరుణ, శ్రీ ఎం. వెంకటరావు, డాక్టర్ కె. అరుణశ్రీ, డాక్టర్ రాజ్ కుమార్ లట్టుపల్లి (జాయ్ ఫౌండేషన్) శ్రీ జి.ఎస్.డి. గుప్తా (షిరిడీ సాయిబాబా అసోసియేషన్, రిటైర్డ్ బీహెచ్ఈఎల్ ఏజీఎం) లకు పురస్కారాలను అందించారు.
తమకు తగిన గుర్తింపు లభించడం పట్ల పురస్కార గ్రహీతలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ ప్రోత్సాహంతో మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా పనిచేస్తామని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వాతి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి చంద్రిక,కొత్తపల్లి కోటేశ్వరరావు, డా. రామన్న, డి.వి.కె.రావు, సుబ్బారావు, వాణీ సాంబశివరావు, విష్ణు ప్రసాద్, పాలం శీను, శివరాం రెడ్డి, బాలన్న, డా.సాంబశివరావు, తెలుగు శాంతి కుమార్, డా.లతాగుప్త, సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




