Miyapur: కొరియర్ బాయ్‌గా వచ్చి చైన్ స్నాచింగ్.. నిందితుడి అరెస్ట్!
Miyapur: మియాపూర్‌లో కొరియర్ బాయ్‌గా నటిస్తూ మహిళ కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన కేడీ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Miyapur: కొరియర్ బాయ్‌గా వచ్చి చైన్ స్నాచింగ్.. నిందితుడి అరెస్ట్!
మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కొరియర్ బాయ్‌గా నటిస్తూ ఇంట్లోకి చొరబడి, మహిళ కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన నిందితుడిని మియాపూర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కానిగిరికి చెందిన షేక్ ఖాజా అర్షాల్ (20) అనే విద్యార్థి ఈ నేరానికి పాల్పడ్డాడు. జులై 31న మియాపూర్‌కు చెందిన బి. ఆదినారాయణ ఇంట్లోకి ఆయుర్వేద మందుల కొరియర్ డెలివరీ నెపంతో ప్రవేశించాడు. ఇంట్లో మహిళ ఒక్కతే ఉన్నట్లు గమనించి, ఆమె ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి, మెడలోని దాదాపు 4 తులాలు గల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకుని పారిపోయాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మియాపూర్ సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా కానిగిరిలో అతని జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన 4 తులాల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన ఆయుర్వేద మందుల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పాత నేరాల చరిత్ర, అరెస్ట్ అయిన ఖాజా అర్షాల్‌పై గతంలోనూ ప్రకాశం జిల్లా కానిగిరి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు (Cr. No. 101/2025, Cr. No. 108/2025) నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, పెప్పర్ స్ప్రే ఉపయోగించి దొంగతనాలకు పాల్పడటం ఇతని నైజమని తెలిపారు.




