Koheda: కోహెడ రూ.47 కోట్లతో చేపల మార్కెట్‌కు శంకుస్థాపన

Koheda: రంగారెడ్డి జిల్లా కోహెడలో ఆధునిక చేపల మార్కెట్‌కు మంత్రి శ్రీహరి శంకుస్థాపన. 5 వేల మందికి ఉపాధి. దేశంలోనే తొలి మంచినీటి చేపల ఎగుమతి కేంద్రంగా గుర్తింపు.

AJAY, HAYATH NAGAR
Published on: 10 July 2026 2:30 PM IST
Koheda
X

Koheda: కోహెడ రూ.47 కోట్లతో చేపల మార్కెట్‌కు శంకుస్థాపన

కోహెడ: రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత ఇంటిగ్రేటెడ్ హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముదిరాజుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయబోనని, అవసరమైతే మంత్రి, ఎమ్మెల్యే పదవులకే కాకుండా ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

దేశంలోనే సముద్రతీర ప్రాంతం కాకుండా అంతర్గత రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి ఆధునిక మంచినీటి చేపల ఎగుమతి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రస్తుతం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను విస్తరించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ మార్కెట్‌లో ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు, భారీ హోల్‌సేల్ మార్కెట్ వంటి అన్ని ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రెండు వేల మంది వ్యాపారులు వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండగా, ఐదు వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా కోహెడలో ఏర్పాటు చేస్తున్న ఎగుమతి ఆధారిత ఇంటిగ్రేటెడ్ హోల్‌సేల్ చేపల మార్కెట్ మత్స్యకారుల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. బ్లూ రివల్యూషన్ లక్ష్యాలను సాకారం చేస్తూ మత్స్యకారులకు ఆధునిక మార్కెటింగ్ సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు, ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతులు, మత్స్యకారులు, కార్మికులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని తెలిపారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్ తెలంగాణ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విజయవాడ జాతీయ రహదారి, నాగార్జునసాగర్ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం చేపట్టడం ద్వారా మత్స్యకారులు, ముదిరాజ్, బెస్త వర్గాలకు విస్తృత ఉపాధి, మార్కెటింగ్ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం సుమారు 13 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు తెలిపారు. అదనంగా మరో రూ.50 కోట్లు మంజూరు చేసి మొత్తం రూ.100 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు దూస వెంకటేష్, ఫిషరీస్ అదనపు డైరెక్టర్ మురళీకృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మత్స్యకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story