Hyderabad: విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి!

Hyderabad: హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.

RAHUL, MEERPET
Published on: 23 July 2026 4:32 PM IST
Hyderabad
X

Hyderabad: విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి!

హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పోషకాహారం, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ & అమెనిటీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు, ఇతర అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం అవకాశం ఇచ్చిన తర్వాత 2023 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలంటే ముందుగా వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయాల్లో డైట్ ఛార్జీల పెంపు ఒకటని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందితేనే వారు ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. సంక్షేమ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు.

విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆధునిక విద్య, డిజిటల్ లెర్నింగ్, మెరుగైన హాస్టల్ వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ విద్యాసంస్థలను దేశంలోనే ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

విక్టోరియా మెమోరియల్ హోమ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్‌ల పంపిణీ కూడా విద్యార్థుల చదువుకు మరింత తోడ్పాటునందించడానికేనని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.

పేద కుటుంబాల్లో పుట్టిన విద్యార్థులు కూడా ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చేలా కష్టపడి చదవాలని, భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story