Meerpet: మీర్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
Meerpet: మీర్‌పేటలో కారు అద్దం ధ్వంసం ఘటనతో మొదలైన గొడవ. రెండు వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో దాడి. పలువురికి గాయాలు, రంగంలోకి దిగిన మీర్‌పేట పోలీసులు.
Meerpet: మీర్‌పేటలో తీవ్ర ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
మీర్‌పేట్: రంగా రెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కారు అద్దం ధ్వంసమైన ఘటనతో మొదలైన వివాదం రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, బాధితులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి 9:30 గంటల సమయంలో బిహార్ రాష్ట్రానికి చెందిన సూర్య, భూపేష్ అనే ఇద్దరు వ్యక్తులు వాగ్వాదం చేసుకుంటుండగా, వారి సెల్‌ఫోన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కారుపై పడటంతో కారు అద్దం ధ్వంసమైంది.
ఈ ఘటనను గమనించిన కారు యజమాని భార్య కవిత వారిని ప్రశ్నించగా, అద్దాన్ని కొత్తది వేయిస్తామని వారు చెప్పినట్లు సమాచారం. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో కవిత తన భర్త మధుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. విషయం తెలుసుకున్న మధు సుమారు 40 మందిని వెంట తీసుకుని బిహార్‌కు చెందిన వ్యక్తులు నివసిస్తున్న కాలనీకి వెళ్లారు. అక్కడ పార్క్ చేసి ఉన్న పలు కార్ల అద్దాలను ధ్వంసం చేస్తూ దాడికి వెళ్లారు.
ఆ కాలనీలో బిహార్‌కు చెందిన వారు సుమారు 500 మందికి పైగా నివసిస్తున్నారు అర్ధరాత్రి ఒక్కసారిగా కార్ల అద్దాలు పగిలిన శబ్దాలు రావడంతో కాలనీవాసులు బయటకు వచ్చారని, అనంతరం ఇరు వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో దాడి మధు వర్గానికి చెందిన వారిపై ప్రత్యర్థి వర్గం వేడి తేనె పోయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు గాయపడిన పలువురు ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బిహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు తేనెను ప్యాకింగ్ చేసి నగరంలో విక్రయాలు నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు దారితీసిన పూర్తి కారణాలు, వాస్తవ పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.




