Uppal: నిర్మాణ భవనంపై నుంచి పడి ఉస్మానియా వైద్య విద్యార్థి మృతి!

Uppal: ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థి కొల్కూరి భరద్వాజ్ నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

KARUNAKAR, UPPAL
Updated on: 16 Aug 2026 7:55 PM IST
Uppal
X

Uppal: నిర్మాణ భవనంపై నుంచి పడి ఉస్మానియా వైద్య విద్యార్థి మృతి!

ఉప్పల్‌: ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన జరిగింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల కొల్కూరి భరద్వాజ్‌ నిర్మాణంలో ఉన్న భవనం నుంచి కిందపడి మృతి చెందాడు. రామంతాపూర్‌లోని పీఎస్‌ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న భరద్వాజ్‌ ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల వరకు(తెల్లవారితే 16వ తేదీ) తన సోదరితో కలిసి చదువుకున్నాడు.

అనంతరం కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో భరద్వాజ్‌ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్నేహితులు, బంధువులను సంప్రదించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఉదయం 7.25 గంటలకు అతడి సోదరి ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఉదయం 8.30 గంటలకు ఎన్‌ఎస్‌ఎల్‌ నిర్మాణ భవనం నుంచి ఓ యువకుడు కిందపడినట్లు డయల్‌-100కు సమాచారం అందింది.

దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, కిందపడి మృతి చెందిన వ్యక్తి భరద్వాజ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య విద్యార్థి కొల్కూరి భరద్వాజ్‌ మృతి ఘటనపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం అతడు ఎన్ఎస్‌ఎల్‌ నిర్మాణ భవనం వద్దకు ఎందుకు వెళ్లాడు? స్వతహాగా అక్కడికి చేరుకున్నాడా? నిర్మాణ ప్రదేశంలోకి ఎలా ప్రవేశించాడు? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా? అనే అంశాలు తెలియాల్సి ఉంది.

అతడు భవనం పై అంతస్తు నుంచే కిందపడ్డాడా? ఘటన సమయంలో ఎవరైనా అక్కడ ఉన్నారా? సీసీ కెమెరాల్లో ఏమైనా దృశ్యాలు నమోదయ్యాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఘటనపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. భరద్వాజ్‌ మృతికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story