Hyderabad: మలక్‌పేటలో 50 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం!
Hyderabad: 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మలక్‌పేట ఛావుని ప్రాంతంలో సివిల్ సప్లై అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దాడులు చేసి స్వాధీనం చేసుకున్నాయి.
Hyderabad: మలక్‌పేటలో 50 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం!
హైదరాబాద్: పాతబస్తీ పరిసరాల్లో అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో మలక్‌పేట సివిల్ సప్లై అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం సంయుక్తంగా మంగళవారం మలక్‌పేట ఛావుని ప్రాంతంలోని గోదాంలపై దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో సుమారు 50 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పాతబస్తీ ప్రాంతాల్లో కొందరు కార్డుదారుల నుండి, డీలర్ల వద్ద కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నారని సమాచారం. సేకరించిన బియ్యాన్ని మలక్‌పేట ఛావుని ప్రాంతంలో గోదాంలు ఏర్పాటు చేసుకుని భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారని, అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు.
అధికారులు తాళం వేసి ఉన్న ఒక గోదాం షెట్టర్ తొలగించి తనిఖీ చేయగా అందులో సుమారు 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం కనిపించింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు.పక్కనే ఉన్న మరో గోదాంకు సెంట్రల్ లాక్ సిస్టం ఉండటంతో షెట్టర్ తెరువలేకపోయారు. ఆ గోదాం తెరిస్తే భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




