Maheshwaram: 'నషా ముక్త్ భారత్' వర్క్‌షాప్ డ్రగ్స్‌పై పోరుకు మీడియా సిద్ధం!

Maheshwaram: మహేశ్వరంలో పీఐబీ ఆధ్వర్యంలో 'నషా ముక్త్ భారత్' వర్క్‌షాప్. డ్రగ్స్ రహిత సమాజం కోసం మీడియా ప్రధాన పాత్ర పోషించాలని డీసీపీ నారాయణ రెడ్డి పిలుపు.

K Sai, Maheswaram
Updated on: 26 Aug 2026 1:29 PM IST
Maheshwaram
X

Maheshwaram: 'నషా ముక్త్ భారత్' వర్క్‌షాప్ డ్రగ్స్‌పై పోరుకు మీడియా సిద్ధం!

Maheshwaram: పత్రికా సమాచార కార్యాలయం- హైదరాబాద్ ఆధ్వర్యంలో.. మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ) కార్యక్రమంపై రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మీడియా ప్రతినిధులకు వార్త మీడియా వర్క్‌షాప్‌ను ఈ రోజు నిర్వహించారు.

మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి (ఐపీఎస్) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈగల్ ఫోర్స్ పోలీస్ సూపరింటెండెంట్ రావుల గిరిధర్ (ఐపీఎస్), పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, మహేశ్వరం ఎంపీడీవో ఎన్. శారదమ్మ ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.మహేశ్వరం జోన్ డీసీపీ శ్రీ కె. నారాయణ రెడ్డి (ఐపీఎస్) మాట్లాడుతూ డ్రగ్స్ భూతాన్ని ఎదుర్కొనేందుకు చట్టపరమైన ఆంక్షలు మాత్రమే సరిపోవు ప్రజలందరి భాగస్వామ్యంతోనే దాన్ని సమర్థంగా కట్టడి చేయగలం అన్నారు.

మాదకద్రవ్య నివారణ చర్యలు ఇళ్లలోనే, బడుల్లోనే మొదలుకావాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, సహచరులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సకాలంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా డ్రగ్స్ ముప్పును సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడుకోవడాన్ని శాంతిభద్రతల అంశంగా మాత్రమే చూడలేమన్నారు. వారి ఆరోగ్యాన్నీ, నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ పెంపొందించడంలోనూ ఇది అత్యావశ్యకమన్నారు.

మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాలు.. నేడు దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారాయని కె.నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణం దిశగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ధ్రువీకృత సమాచారాన్ని ప్రసారం చేయాలనీ,మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను చెప్పాలనీ, డ్రగ్స్ బారిన పడకుండా యువతను ముందస్తుగానే జాగరూకులను చేయాలనీ, కౌన్సెలింగ్ - పునరావాస సేవలపై ప్రజలకు తగిన సమాచారాన్ని అందించాలనీ మీడియా సిబ్బందిని ఆయన కోరారు.

మాదకద్రవ్యాలను అరికట్టే దిశగా సమన్విత చర్యలను వివరించిన ఈగల్ ఫోర్స్ ఎస్పీ

‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై అవగాహన సదస్సులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసు సూపరింటెండెంట్ రావుల గిరిధర్ (ఐపీఎస్) మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత,కుటుంబ సమస్య స్థాయిని దాటి.. నేడు తీవ్రమైన సామాజిక,శాంతిభద్రతల, జాతీయ భద్రతా సవాలుగా పరిణమించిందన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనే దిశగా సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నీ సమన్వయంతో కృషి చేయాలన్నారు.

జనవరి నుంచి తెలంగాణలో దాదాపు 8 వేల కేజీల గంజాయిని ఈగల్ ఫోర్స్ సీజ్ చేసిందని ఆయన తెలిపారు.దాదాపు 22 రకాల శిక్షణ కార్యక్రమాల ద్వారా 30 వేల మందికి పైగా పోలీసు సిబ్బందికీ, ఇతర శాఖల అధికారులకూ శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ఈ సమన్విత చర్యల్లో మీడియా సిబ్బంది పాత్ర అత్యంత కీలకమైనదని రావుల గిరిధర్ అన్నారు. బాధ్యతాయుతమైన, సున్నితత్వంతో కూడిన రిపోర్టింగ్ ద్వారా.. యువతలో అవగాహనను పెంపొందించవచ్చనీ, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చనీ, పునరావాస చర్యలను ప్రోత్సహించవచ్చనీ పేర్కొన్నారు.

మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులను నివేదించేటప్పుడు కచ్చితత్వాన్నీ, సున్నితత్వాన్నీ దృష్టిలో పెట్టుకోవాలని మీడియా సిబ్బందిని కోరారు. ముఖ్యంగా మైనర్ల వివరాలను గోప్యంగా ఉంచాలనీ, మాదకద్రవ్యాల బారిన పడ్డవారి వ్యక్తిగత వివరాలను అనవసరంగా బహిర్గతం చేయొద్దనీ సూచించారు.

నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనలో పోలీసులు - మీడియా మధ్య బలమైన సమన్వయం, జాగరూకతతో కూడిన ప్రజల భాగస్వామ్యం అత్యావశ్యకమని ఆయన వ్యాఖ్యానించారు.

పీఐబీ- హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘డ్రగ్స్ ముప్పు ఇకపై వ్యక్తిగత సమస్యో, కుటుంబ సమస్యో కాదనీ, నేడు ఇదొక తీవ్రమైన సామాజిక, శాంతిభద్రతల, జాతీయ భద్రతా సవాలుగా పరిణమించింది’’ అని ఆయన అన్నారు.వార్త వర్క్‌షాప్ ద్వారా.. కచ్చితమైన సమాచారమూ, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ విధానాలతో జర్నలిస్టులను సన్నద్ధులను చేయడమే పీఐబీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తద్వారా వారు నషా ముక్త్ భారత్ అభియాన్‌కు అర్థవంతంగా దోహదపడి, మాదకద్రవ్యాల వ్యాప్తిని నివారించడంలో దోహదపడతారన్నారు.

అనంతరం వక్తలతో జర్నలిస్టులు మాట్లాడారు. కార్యాచరణ సమస్యలు,పునరావాస సేవల లభ్యత, మాదకద్రవ్యాల సంబంధిత కథనాల రిపోర్టింగ్ వంటి విషయాలపై వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

పీఐబీ- హైదరాబాద్ మీడియా- కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 60 మంది మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story