LB Nagar: SIR ద్వారా ఓట్ల తొలగింపుతో బిజెపి లబ్ధి పొందుతుంది
LB Nagar: ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలోని ఎస్.వి.ఎల్ ఎరీనాలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల (BLAs) శిక్షణ కార్యక్రమం జరిగింది.
LB Nagar: SIR ద్వారా ఓట్ల తొలగింపుతో బిజెపి లబ్ధి పొందుతుంది
LB Nagar: ఎల్బీనగర్ ఓటరు సవరణ ప్రక్రియ (SIR ) ద్వారా బీజేపీ ప్రభుత్వం తమ వ్యతిరేక వర్గాల ఓట్లను తొలగించి ఎన్నికల్లో లబ్ధి పొందుతుందని, మొన్న జరిగిన బెంగాల్ ఎన్నికల్లో ఇదే జరిగిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ లకు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలోని ఎస్.వి.ఎల్ ఎరీనాలో జరిగింది.
మధుయాష్కి గౌడ్ గారితో పాటు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు, బీఎల్ఏ ల నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నెల గద్దర్ గారు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గారు మాట్లాడుతూ.. బెంగాల్ లో జరిగిన ఎస్ ఐ ఆర్ లో భాగంగా 90 లక్షల ఓట్లను తొలగించి, ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలిచిందన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ వ్యవధిలో అనూహ్యంగా 1.2 కోట్ల ఓట్లను కొత్తగా చేర్చి బీజేపీ లబ్ధి పొందిందని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు లేవనెత్తినప్పటికీ ఈసీ గానీ, సుప్రీంకోర్టు గానీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారే వంద నియోజకవర్గాలలో ఓట్ల కౌంటింగ్ లోపాలను బయటపెట్టారని గుర్తు చేశారు.
ఈసీఐ అంటే ఈడీ, సీబీఐ, ఐటీ గా మార్చి ప్రతిపక్ష నేతల పై దాడులు, కేసులతో బిజెపి బెదిరింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో జరగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్క బిఎల్ఎ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఓటర్ల తొలగింపు చేర్పులపై బి ఎల్ ఓ లతో సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సర్ ప్రక్రియలో బిఎల్ఎలు చాలా కీలకమని పేర్కొన్నారు.
చల్లా నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం సర్ తో ఓట్ చోరీకి పాల్పడుతుందని, పేద వర్గాల ఓట్లు గల్లంతు కాకుండా బీఎల్ఏ లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెన్నెల గద్దర్ గారు మాట్లాడుతూ.. మన ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ లో పార్టీ బీఎల్ఏ లు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు.
మల్ రెడ్డి రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ... ఎస్ ఐ ఆర్ ప్రక్రియ అంత ఆషామాషిగా తీసుకోవద్దన్నారు. ఇటీవల బిఎల్ఓ లు నిర్వహించిన సర్వేలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 74% మందికి ఓటర్ మ్యాపింగ్ లో తేడాలు ఉన్నాయని గుర్తించడం చూస్తే చాలా ఓట్లు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, బిఏల్ఏలు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నుంచి నియమితులైన ట్రైనర్ చైతన్య కృష్ణారెడ్డి గారు ఎస్ఐఆర్ ప్రక్రియను వివరించి, బీఎల్ఏ ల బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నేతలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




