LB Nagar: నేపాల్ వరదల్లో ఎల్‌బీనగర్ వాసి సుహాసిని రెడ్డి గల్లంతు

LB Nagar: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో ఎల్‌బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి గల్లంతయ్యారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 28 Aug 2026 5:38 PM IST
LB Nagar
X

LB Nagar: నేపాల్ వరదల్లో ఎల్‌బీనగర్ వాసి సుహాసిని రెడ్డి గల్లంతు

ఎల్‌బీనగర్‌: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో విషాదం నెలకొంది. వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి గారు నేపాల్‌ వరదల్లో గల్లంతయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సుహాసిని.. స్నేహితులతో కలిసి నేపాల్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సుహాసిని రెడ్డి న్యూజిలాండ్‌ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె గల్లంతైన విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మధు యాష్కీ గౌడ్‌ సూచనల మేరకు టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి వాస్తు కాలనీలోని సుహాసిని కుటుంబాన్ని పరామర్శించారు.

ఆమె తండ్రి మహేందర్‌ను కలిసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. సుహాసిని ఆచూకీ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

“ఎవరూ అధైర్యపడవద్దు.. సుహాసిని రెడ్డి ఆచూకీ కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించి స్వదేశానికి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం” అని దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

సుహాసిని రెడ్డి క్షేమంగా తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story