LB Nagar: నిరుద్యోగుల అడ్డాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే.. చాయ్ తాగుతూ కాంగ్రెస్‌పై ఫైర్!

LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్ లో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన ‘ఆస్పరెంట్ అడ్డా’ టీ పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమావేశమయ్యారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 16 May 2026 1:06 PM IST
LB Nagar
X

LB Nagar: నిరుద్యోగుల అడ్డాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే.. చాయ్ తాగుతూ కాంగ్రెస్‌పై ఫైర్!

LB Nagar: ఎల్బీనగర్ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

పలువురు నిరుద్యోగ యువత స్వయంగా ఏర్పాటు చేసుకున్న “ఆస్పరెంట్ అడ్డా- టీ పాయింట్” వద్ద నిరుద్యోగులతో టీ తాగుతు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో నిరుద్యోగ యువతను కలిసి పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని, పారదర్శక నియామక వ్యవస్థ తీసుకువస్తామని, “జాబ్ క్యాలెండర్” విడుదల చేస్తామని, నిరుద్యోగ భృతి అంశాన్ని పరిశీలిస్తామని, గ్రూప్స్, DSC తదితర నియామకాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువత సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో చెప్పారని తెలిపారు.

అలాగే ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించిన “యూత్ డిక్లరేషన్”లో తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, గ్రూప్స్, DSC, పోలీస్ తదితర నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తామని, విద్యార్థులు మరియు నిరుద్యోగులకు ₹5 లక్షల వరకు “విద్యా భరోసా కార్డు” అందిస్తామని, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఉద్యోగ అవకాశాలు పెంచుతామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌లను సమయానికి విడుదల చేస్తామని, గిగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఈ హామీలను నమ్మి యువత ఊరు ఊరు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరిందని, కానీ ఇప్పుడు ఆ హామీలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. ఉద్యోగాల ఊసే లేకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరాశలోకి నెట్టిందన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ దానిపై స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందన్నారు.

అదేవిధంగా జీవో 29 మరియు జీవో 46లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో చోటుచేసుకున్న అనుమానాల పై SIT ఎంక్వయిరీ నిర్వహించి పారదర్శక విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో భారస పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సుధీర్ రెడ్డి గారు హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ భారస నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు,మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ మరియు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్,శంకర్,శింబు నాయక్, భూక్యాకుమార్, నవీన్ పట్నాయక్, సింధురెడ్డి, ఆకాష్, అంజలి,శ్రీదేవి,అశోక్,నందు,శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story