LB Nagar: ఎల్‌బీనగర్‌లో రూ.1.5 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ పట్టివేత!

LB Nagar: ఎల్‌బీనగర్ వద్ద రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్ పట్టివేత. ఆరుగురి అరెస్ట్. కాళ్లకు, కడుపునకు కట్టుకుని తరలిస్తుండగా పోలీసుల అదుపులోకి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 17 Aug 2026 1:21 PM IST
LB Naga
X

LB Nagar: ఎల్‌బీనగర్‌లో రూ.1.5 కోట్ల విలువైన హషీష్ ఆయిల్ పట్టివేత!

LB Nagar: పోలీసుల కళ్లుగప్పి హషీష్ ఆయిల్‌ను శరీరానికి కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. చింతల్‌కుంట వద్ద నిర్వహించిన ఆపరేషన్‌లో ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి 12 కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని మల్కాజిగిరి సీపీ బి.సుమతి తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల నుంచి.. బెంగళూరుకు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హషీష్ ఆయిల్‌ను సేకరించి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. పక్కా సమాచారంతో చింతల్‌కుంట వద్ద నిందితులను అడ్డుకున్నామని తెలిపారు.

బస్సులో ప్రయాణిస్తూ డ్రగ్స్‌ను తరలించే ప్రయత్నం చేశారని.. పోలీసులు తనిఖీలు చేయడంతో వారి అక్రమ రవాణా బయటపడిందని చెప్పారు.

కాళ్లకు.. కడుపుకు కిలో చొప్పున!

పోలీసుల కళ్లుగప్పేందుకు క్యారియర్లు వినూత్న పద్ధతిని అనుసరించారు. ఒక్కొక్కరు రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపుకు మరో కిలో.. మొత్తం 3 కిలోల హషీష్ ఆయిల్‌ను బ్రౌన్ టేపుతో శరీరానికి కట్టుకుని తరలించారు.

నలుగురు క్యారియర్లు కలిపి 12 కిలోల హషీష్ ఆయిల్ తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.10 లక్షలకు డీల్

ఈ 12 కిలోల హషీష్ ఆయిల్‌ను బెంగళూరుకు చేర్చేందుకు అక్కడి రిసీవర్ సిజో రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరుకు బెంగళూరుకు చేరిన అనంతరం ప్రధాన నిందితులకు ఆ మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు.

నిరుద్యోగ గిరిజన యువతే క్యారియర్లు

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా బెంగళూరులో ఉంటున్నట్లు సీపీ తెలిపారు. వీరిద్దరూ గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు.

నలుగురు క్యారియర్లలో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో హషీష్ ఆయిల్‌ను పలుమార్లు తరలించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

జైలు నుంచి వచ్చి.. మళ్లీ దందా

ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీనుపై గతంలోనే నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ హషీష్ ఆయిల్ అక్రమ రవాణా ప్రారంభించినట్లు వెల్లడించారు.

సరఫరాదారు.. రిసీవర్ కోసం గాలింపు

హషీష్ ఆయిల్ సరఫరా చేసిన కృష్ణ, బెంగళూరులోని ప్రధాన రిసీవర్ సిజో ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని సీపీ తెలిపారు. ముఠాలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యం

హషీష్ ఆయిల్‌లో టీఎచ్‌సీ శాతం సుమారు 40 శాతం ఉండటంతో దీనికి ధర ఎక్కువగా ఉంటుందని సీపీ సుమతి తెలిపారు. మత్తుపదార్థాల నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని, డ్రగ్స్ విషయంలో అసలు రాజీపడబోమని స్పష్టం చేశారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపడంతో పాటు సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story