LB Nagar: డిజిటల్ అరెస్ట్ కలకలం వృద్ధురాలి నుంచి రూ.21 లక్షలు స్వాహా!
LB Nagar: ఎల్బీనగర్ పరిధిలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భయభ్రాంతులకు గురిచేసి 68 ఏళ్ల వృద్ధురాలి నుంచి రూ.21 లక్షలు కాజేశారు.
LB Nagar: డిజిటల్ అరెస్ట్ కలకలం వృద్ధురాలి నుంచి రూ.21 లక్షలు స్వాహా!
LB Nagar: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేసి రూ.21 లక్షలు కొల్లగొట్టారు. టెలికాం అధికారులు, న్యాయ సలహాదారులు, పోలీసులు, సీబీఐ అధికారులమంటూ పరిచయం చేసుకుని.. అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్ట్ చేస్తామని బెదిరించారు.
ఆర్కేపురం కాలనీకి చెందిన కె. నాగలక్ష్మి (68) భర్త మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 1న టెలికాం అధికారినంటూ ప్రసాద్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. అనంతరం న్యాయ సలహాదారుడినంటూ రాజేశ్‌కుమార్ మాట్లాడాడు.
తమ పేర్లను ఉపయోగించుకుని అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని, కేసులో ఆమెను అరెస్ట్ చేస్తామని నిందితులు బెదిరించారు. అనంతరం పోలీసులు, సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్‌లో విచారణ చేపట్టారు.
అరెస్టు చేస్తారనే భయంతో మానసిక ఒత్తిడికి గురైన నాగలక్ష్మి.. నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలకు రూ.21 లక్షలను బదిలీ చేశారు. అంతటితో ఆగకుండా మరింత నగదు బదిలీ చేయాలని నిందితులు ఒత్తిడి చేయడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
ఈ నెల 5న జరిగిన విషయాన్ని కుమారుడికి చెప్పడంతో.. ఆయన ఆదివారం సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు బదిలీ చేయవద్దని, వెంటనే సైబర్‌క్రైమ్ పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.




