Hyderabad: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సవాల్ విసిరిన దర్పల్లి

Hyderabad: ఎల్బీనగర్‌లో ₹80 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి ₹21 కోట్లతో స్కూల్ కడుతున్నామని టీపీసీసీ ప్రతినిధి దర్పల్లి తెలిపారు. 15 ఏళ్ల అభివృద్ధిపై సుధీర్ రెడ్డికి సవాల్ విసిరారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 Sept 2026 10:58 PM IST
Hyderabad
X

Hyderabad: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సవాల్ విసిరిన దర్పల్లి

హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ కామేశ్వర్ కాలనీ సతి రెడ్డి తోటలో కబ్జాకు గురైన సర్వే నంబర్ 86లోని 1 ఎకరం 21 గుంటల ప్రభుత్వ భూమిని వెలికితీసి, సుమారు రూ.80 కోట్ల విలువైన భూమిలో రూ.21 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపడుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తన 15 ఏళ్ల ఎమ్మెల్యే పదవీకాలంలో ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజల సమక్షంలో చర్చకు రావాలని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ కళాశాలను కూడా తీసుకురాలేదని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మధు యాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపడుతోందని తెలిపారు. హైడ్రా ద్వారా రూ.88 కోట్లు, బండ్ అభివృద్ధికి రూ.6 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు, సీఎం రోడ్–బండ్ స్ట్రామ్ వాటర్ డ్రైన్‌కు రూ.6 కోట్లు, ఎస్టీపీ నిర్మాణానికి రూ.19 కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలు కడుతున్న పన్నుల డబ్బుతోనే ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల సొమ్మును ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగిస్తున్నామని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు కనిపిస్తున్నాయని అన్నారు.

లింగోజిగూడ డివిజన్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్ర ఏమాత్రం లేదని రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విద్యా మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ‘చెంచాలు’ అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మరి ఎమ్మెల్యే వెంట తిరిగే వారిని ఏమని పిలవాలని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సుధీర్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభావతి, జ్యోతి రెడ్డి, అనసూయ, సుధీర్ రెడ్డి, మనోజ్, ఉమేష్, శ్రీనాథ్, విష్ణు, అమీర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story