LB Nagar: ఆగస్టు 10న 'జైల్ భరో'ను జయప్రదం చేయండి సీఐటీయూ
LB Nagar: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న దేశవ్యాప్త 'జైల్ భరో'. విజయవంతం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ పిలుపు.
LB Nagar: ఆగస్టు 10న 'జైల్ భరో'ను జయప్రదం చేయండి సీఐటీయూ
ఎల్బీనగర్: ఎల్బీనగర్ ...కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్ పిలుపునిచ్చారు.
తుర్కయంజాల్ డివిజన్ సీఐటీయూ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు డి. కిషన్ అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ (AIKS), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) సంయుక్త ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చడం వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటాయని, పనిదినం 12 గంటలకు పెరిగే ప్రమాదం ఉందని, కనీస వేతనాలు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులు బలహీనపడతాయని విమర్శించారు. లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, ఆశా, అంగన్‌వాడీ, ఐకేపీ, మున్సిపల్, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. జిల్లాలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ, రైతు సంఘం, లాయర్స్ యూనియన్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.




