LB Nagar: ఎండిపోయిన చెరువు అడుగున ‘5K రన్’.. దాత్రి ఎన్జీఓ వినూత్న ప్రయోగం!

LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్‌లో ఎండిపోయిన పెద్ద చెరువు అడుగు భాగంలో 'దాత్రి NGO' సంస్థ మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్‌తో కలిసి "5K Run Below The Lake" పేరుతో వినూత్న రన్ నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 9 Jun 2026 3:41 PM IST
LB Nagar
X

LB Nagar: ఎండిపోయిన చెరువు అడుగున ‘5K రన్’.. దాత్రి ఎన్జీఓ వినూత్న ప్రయోగం!

ఎల్బీనగర్: చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించేందుకు *దాత్రి NGO సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మన్సూరాబాద్‌లో ఎండిపోయిన పెద్ద చెరువు అడుగున 5K Run Below The Lake పేరుతో రన్ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు చెరువు మధ్యలో నీటి బిందువు ఆకారంలో నిల్చొని "చెరువులను కాపాడుకుందాం - భూగర్భ జలాలను పెంచుకుందాం" అనే సందేశంతో అవగాహన కల్పించారు. మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించారు.

దాత్రి NGO వ్యవస్థాపకులు వెంకట్ మాట్లాడుతూ చెరువులు ఎండిపోతే బోర్లు ఎండిపోతాయని, బోర్లు ఎండిపోతే భవిష్యత్ తరాలకే కాదు ప్రస్తుత తరానికే ముప్పు తప్పదన్నారు. చెరువులను వర్షపు నీటితో కాకుండా డ్రైనేజ్ నీటితో నింపడం, వర్షపు నీరు వచ్చేలా బాక్స్ డ్రైన్ వ్యవస్థలు సరిగ్గా నిర్మించకపోవడమే చెరువులు, బోర్లలో నీళ్లు లేకపోవడానికి కారణమన్నారు.

ఈ రోజు ఎండిపోయిన చెరువు అడుగున పరిగెత్తామని, ఇలాంటి పరిస్థితులు భవిష్యత్‌లో రాకుండా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువుల్లో మురుగు నీరు రాకుండా చూసి వర్షపు నీటితో నింపాలన్నారు. చెరువులోకి సరైన వరద ప్రవాహ మార్గాలు లేకపోవడంతో ప్రతీ ఏటా వేల క్యూసెక్కుల వర్షపు నీరు వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీట్ల కొద్దీ బోర్లు వేస్తున్నామని, కానీ చెరువుల్లో నీరు చేరితే సమస్యలకు సులభ పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి చెరువుల్లోకి వర్షపు నీరు చేరేలా చర్యలు తీసుకుని భవిష్యత్‌లో నీటి కొరతను నివారించాలని విజ్ఞప్తి చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story