Hyderabad: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు డాక్టర్ కోట నీలిమ!

Hyderabad: అమీర్‌పేట్ సత్యం థియేటర్ వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టిన డాక్టర్ కోట నీలిమ. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని పిలుపు.

RAJESH,	WEST ZONE
Published on: 12 Sept 2026 3:37 PM IST
Hyderabad
X

Hyderabad: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు: డాక్టర్ కోట నీలిమ!

Hyderabad: వినాయక చవితి పండగను పురస్కరించుకుని అమీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సత్యం థియేటర్ సర్కిల్ వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరై స్థానికులకు మట్టి గణేశుని ప్రతిమలను పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. వినాయక చవితి పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండగను ఆనందంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు.

ప్రకృతి పరిరక్షణకు అనుకూలమైన మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నిమజ్జనం సమయంలో చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. మట్టి గణపతి విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోవడంతో పాటు జలవనరుల పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు.

ప్రజలు పర్యావరణహితమైన విగ్రహాలను వినియోగిస్తూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పండగను భక్తి, ఆనందంతో పాటు బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE