Hyderabad: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పరిశీలన!

Hyderabad: చేవెళ్లలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి; జాప్యంపై అధికారులపై అసంతృప్తి, రైతుల సమస్యలపై సమీక్ష.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 30 Aug 2026 9:22 AM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పరిశీలన!

Hyderabad: చేవెళ్లలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల పురోగతి, భూసేకరణ, రోడ్డు డిజైన్, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జాతీయ రహదారి పనులు ఆశించిన స్థాయిలో ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు. పనుల్లో జరుగుతున్న జాప్యానికి కారణాలను స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణంలో ఉన్న వంకరలు, మలుపులపై కూడా మంత్రి ఆరా తీశారు.

రోడ్డులో ఎక్కువ మలుపులు ఉండటం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రహదారి డిజైన్‌ను పరిశీలించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చిందని, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు.

రోడ్డుకు ఇరువైపులా ఎత్తు తేడాలు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో ఒకవైపు మాత్రమే సర్వీస్ రోడ్డు ఉండడం, మరోవైపు సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల స్థానిక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

జాతీయ రహదారి నిర్మాణం కారణంగా తమ పొలాలకు వెళ్లేందుకు, వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు రైతులు మంత్రి వద్ద తమ సమస్యలను వివరించారు. రహదారి నిర్మాణంతో పాటు రైతుల రాకపోకలకు అనుకూలంగా సర్వీస్ రోడ్లు, అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు.

రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి అడిగిన ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంలో తడబడటంతో కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారి పనుల విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని, పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పనుల పురోగతి, భూసేకరణ, రహదారి మలుపులు, సర్వీస్ రోడ్లు, రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. స్థానిక రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయితే హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్, బీజాపూర్ వైపు ప్రయాణించే ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం, చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story