Keesara: కీసరలో వైన్స్ ముందు అడ్డగోలు పార్కింగ్.. ట్రాఫిక్ ఇబ్బందులు

Keesara: కీసర త్రినేత్ర వైన్స్ వద్ద రోడ్డుపైనే ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్. శ్రావణమాసంలో కీసరగుట్ట భక్తులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు, స్థానికుల ఆగ్రహం.

ASHOK, KAPRA
Published on: 16 Aug 2026 8:51 PM IST
Keesara
X

Keesara: కీసరలో వైన్స్ ముందు అడ్డగోలు పార్కింగ్.. ట్రాఫిక్ ఇబ్బందులు

కీసర: కీసరలోని త్రినేత్ర వైన్స్‌ ముందు పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వాహనదారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపై వాహనాలు నిలిపివేస్తుండటంతో ప్రధాన రహదారిపైనే ట్రాఫిక్‌ కష్టాలు తలెత్తుతున్నాయి. వైన్స్‌ ముందు నుంచి మెయిన్‌ రోడ్డు వరకు వాహనాలు అడ్డంగా నిలుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కీసర నుంచి కీసరగుట్టకు వెళ్లే ప్రధాన మార్గంలోనే త్రినేత్ర వైన్స్‌ ఉండటంతో ఇక్కడికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మద్యం ప్రియులు వస్తుంటారు. అంకిరెడ్డిపల్లి, బోగారం, వన్నిగూడ, కీసర తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో వైన్స్‌ పరిసరాలు నిత్యం రద్దీగా మారుతున్నాయి.

రోడ్డే పార్కింగ్‌ స్థలమా?

వైన్స్‌ వద్ద వాహనాలు నిలిపేందుకు సరైన నియంత్రణ లేకపోవడంతో ఎవరికి తోచిన చోట వారు వాహనాలు నిలిపేస్తున్నారు. వైన్స్‌ ముందు నుంచి ప్రధాన రహదారి వరకు వాహనాలు వరుసగా నిలవడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు దుకాణాల ఏర్పాటు, మరోవైపు ఇష్టారాజ్య పార్కింగ్‌.. వెరసి ప్రధాన రహదారి కుంచించుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది.

ప్రధాన రహదారిపైనే ఈ తంతు జరుగుతున్నా ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడ? అంటూ స్థానికులు నిలదీస్తున్నారు. శ్రావణమాసంలో భక్తులకు తప్పని తిప్పలు ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నగరం నుంచి కీసరగుట్టకు వచ్చే భక్తుల వాహనాలు ఇదే మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

అలాంటి కీలక సమయంలో వైన్స్‌ ముందు అడ్డగోలు పార్కింగ్‌కు అడ్డుకట్ట లేకపోవడంతో భక్తుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు స్వాగతం పలకాల్సిన మార్గం.. వైన్స్‌ ముందు ట్రాఫిక్‌ తిప్పలతో ఇబ్బందుల మార్గంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు నిద్రలో ఉన్నారా?

ప్రధాన రహదారిపై వాహనాలు అడ్డంగా నిలిపితే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు.. ఇక్కడ మాత్రం పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైన్స్‌ నిర్వహణపై పర్యవేక్షణ చేయాల్సిన ఎక్సైజ్‌ శాఖ కూడా ఈ పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

వైన్స్‌ వ్యాపారం చేసుకోవడం ఒక విషయం.. ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగేలా రహదారినే పార్కింగ్‌ స్థలంగా మార్చడం మరో విషయం అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

ఇకనైనా చర్యలు ఉంటాయా?

కీసర పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా త్రినేత్ర వైన్స్‌ వద్ద పరిస్థితిని పరిశీలించి, రోడ్డుపై వాహనాల ఇష్టారాజ్య పార్కింగ్‌కు చెక్‌ పెట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

భక్తుల రాకపోకలు మరింత పెరిగేలోపే అధికారులు స్పందించకపోతే ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రోడ్డుపై అడ్డగోలు పార్కింగ్‌ కనిపిస్తే వెంటనే చలాన్లు వేసే ట్రాఫిక్‌ పోలీసుల నిఘా.. త్రినేత్ర వైన్స్‌ ముందు ఎందుకు కనిపించడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story