Hyderabad: పార్టీలకతీతంగా బోనాలు జరగాలి ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Hyderabad: జూబ్లీహిల్స్‌లో 96 దేవాలయాలకు రూ. 53 లక్షల బోనాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్. పండుగను సామరస్యంతో నిర్వహించాలని పిలుపు.

RAJESH,	WEST ZONE
Published on: 30 July 2026 6:57 PM IST
Hyderabad
X

Hyderabad: పార్టీలకతీతంగా బోనాలు జరగాలి ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్: ఆషాఢ మాస-2026 బోనాల మహోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన రూ.53 లక్షల విలువైన 96 ఆర్థిక సహాయ చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు నేడు ఆలయ కమిటీ సభ్యులకు పంపిణీ చేశారు.

శ్రీనగర్ కాలనీ డివిజన్‌లోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పాలకులు దేవాలయల పైన రాజకీయాలు చేశారు.. మనం అలాంటి నీచ సంస్కృతి కి తావులేకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోనాల పండుగలను పార్టీలకతీతంగా, భక్తి శ్రద్ధలతో, సామరస్య వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో ఇంకా ప్రభుత్వ గుర్తింపు పొందని దేవాలయాలను తన దృష్టికి తీసుకువస్తే, సొంత ఖర్చులతో వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు, ఇన్‌చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారితో ప్రత్యేకంగా చర్చించి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని దేవాలయాలకు మరింత అధిక నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.

బోనాల జాతరలు జరిగే ప్రతి ఆలయం వద్ద మున్సిపల్, పోలీసు, విద్యుత్, జలమండలి, పారిశుద్ధ్య తదితర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఉత్సవాలకు ప్రాధాన్యతనిస్తూ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొన్న ఎమ్మెల్యే, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు విఠలయ్య గారు, శ్రీదేవి గారు, ఈవో శ్రీనివాస శర్మ గారు, వివిధ డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story