Hyderabad: రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్ కుటుంబం!
Hyderabad: హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో యువతి మృతి పట్ల జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుటుంబం సంతాపం. ఊహాగానాలు నమ్మవద్దని, దర్యాప్తునకు సహకరిస్తున్నామని వెల్లడి.
Hyderabad: రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్ కుటుంబం!
Hyderabad: హైదరాబాద్‌లో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందడం తీవ్ర విచారకరమని జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుటుంబం పేర్కొంది. ఈ విషాద ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, మృతురాలి కుటుంబం పడుతున్న బాధను అర్థం చేసుకుంటున్నామని తెలిపింది. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించిన కుటుంబ సభ్యులు.. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రమాద ఘటనపై ఎవరూ ఊహాగానాలు చేయవద్దని, వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రాకముందే ఎలాంటి ముందస్తు తీర్పులకు రావద్దని లింగమనేని కుటుంబం విజ్ఞప్తి చేసింది. ఘటనకు సంబంధించి నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ఇప్పటికే విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రమాదం జరిగిన వెంటనే వాహనం నడుపుతున్న తమ కుమారుడు సాంజుష్ స్పందించారని కుటుంబం వెల్లడించింది. గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారని, అనంతరం పోలీసులకు సమాచారం అందించి ఘటనకు సంబంధించిన అవసరమైన వివరాలను అందించారని తెలిపింది.
కేసు నమోదు అనంతరం సాంజుష్‌కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షల్లో అన్ని ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు కుటుంబం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు సంస్థలకు సాంజుష్ పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొంది.
ఘటనకు సంబంధించిన ఏ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయలేదని, చట్టపరమైన ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని లింగమనేని కుటుంబం స్పష్టం చేసింది. పోలీసు శాఖకు, దర్యాప్తు సంస్థలకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. నిష్పాక్షికంగా జరిగే దర్యాప్తు ద్వారా ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబం విషాదాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కుటుంబం కోరింది. ఈ సమయంలో బాధిత కుటుంబం పట్ల సంయమనం పాటించాలని, తప్పుడు, నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
చట్టం తన పని తాను చేసుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కోరారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా, అధికారికంగా వెలువడే వాస్తవాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని విధాలా సహకరిస్తామని లింగమనేని కుటుంబం మరోసారి స్పష్టం చేసింది.




