Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం విద్యార్థులకు పండగే.. నేడే నూతన డిగ్రీ కళాశాల ప్రారంభం!
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చొరవతో 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం విద్యార్థులకు పండగే.. నేడే నూతన డిగ్రీ కళాశాల ప్రారంభం!
Ibrahimpatnam: వేలాది విద్యార్థుల అక్షర కోవెల. భవిష్యత్తుకు బంగారుబాటలు వేసే నూతన విద్యాసౌధం ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యపు నీడలో నిలబడి... నేతల అసమర్థత నిదర్శనంగా నిలిచిన ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల భవనం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంది. అద్దె భవనాలు, అరకొర వసతులు, షిఫ్ట్ పద్ధతి తరగతులతో ఏళ్ల పాటు సాగిన ఈ కళాశాల ప్రస్థానం ఇక సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆచార్య వినోభాబావె నడయాడిన చోట సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న నూతన ఉన్నత విద్యాకేంద్రం ప్రారంభోత్సవం బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ఘనంగా జరిగనుంది.
ఇన్నాళ్లూ అక్షరాలా ఆగిపోయిన అడుగు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో 2008లో కాంగ్రెస్ హయాంలో డిగ్రీ కళాశాలను మంజూరు చేయటం జరిగింది. నాటి నుంచి బీఆర్ఎస్ రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. భవనం మంజూరుకు పదేళ్లు పట్టింది. గత 18ఏళ్లుగా సరైన భవనం లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం పూట డిగ్రీ కళాశాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎండలో వేచి చూడటం, సాయంత్రం వేళల్లో రవాణా సౌకర్యం లేక గ్రామీణ ప్రాంత విద్యార్థినులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 2017లో వినోభానగర్ లో నూతన భవన నిర్మాణానికి రూ.3.25కోట్లతో ప్రారంభోత్సవం చేసి, పదేళ్లుగా పనులు చేస్తూ వచ్చారు. అలా వదిలేసిన డిగ్రీ కళాశాల భవనానికి ఇక శాశ్వత పరిష్కారం లభించింది.
ఎమ్మెల్యే మల్ రెడ్డి ప్రత్యేక చొరవతో సిద్ధమైన విద్యాకేంద్రం..
విద్యతోనే వికాసం సాధ్యమని నమ్మే మన ప్రియతమ శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి.. ఇబ్రహీంపట్నంలో షిఫ్ట్ ల వారీగా సాగుతున్న జూనియర్, డిగ్రీ తరగతులు, గ్రామీణ విద్యార్థుల కష్టాలు చూసి చలించిపోయారు. ఇందులో భాగంగానే ఉన్నతాధికారులతో మాట్లాడి, పెండింగ్ లో ఉన్న నిధులను మంజూరు చేయించారు. అనంతరం, అన్నీతానే.... గుత్తేదారులను, అధికారులను పరుగులు పెట్టించి, నూతన భవన నిర్మాణం ఎట్టకేలకు పూర్తి చేయించారు.
ఇకపై ప్రకృతి ఒడిలో విద్యావికాసం..
ఐదెకరాలలో రూపుదిద్దుకున్న ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం కార్పొరేట్ తరహాలో సకల సదుపాయాలతో సిద్ధమైంది. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో 550మంది విద్యనభ్యసిస్తుండగా.. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.




