Ghatkesar: ఘట్‌కేసర్‌లో అనుమానంతో భార్యను ఇటుకతో కొట్టి చంపిన భర్త!

Ghatkesar: ఘట్‌కేసర్ పరిధిలో మద్యం మత్తులో భార్య ప్రవర్తనపై అనుమానంతో సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేసిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

KARUNAKAR, UPPAL
Updated on: 12 Aug 2026 12:57 PM IST
Ghatkesar
X

Ghatkesar: ఘట్‌కేసర్‌లో అనుమానంతో భార్యను ఇటుకతో కొట్టి చంపిన భర్త!

Ghatkesar: కుటుంబ కలహాలు, భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను సిమెంట్‌ ఇటుకతో కొట్టి హత్య చేసిన దారుణ ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ద్వారకానగర్‌లో జరిగింది. మినర్వా స్కూల్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనపై మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కిలగనూర్‌ మండలం సలకలపూర్‌ గ్రామానికి చెందిన మాధవి (37)కి 18 ఏళ్ల క్రితం కాట్రావత్‌ రాజు (44)తో వివాహం జరిగింది. దంపతులు గత 15 ఏళ్లుగా ఘట్‌కేసర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గత మూడేళ్లుగా రాజు మద్యానికి బానిసై, భార్య మాధవి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగా తరచూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని పేర్కొన్నారు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించి నచ్చజెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు.

ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి రాజు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో భార్య మాధవిపై సిమెంట్‌ ఇటుకతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ఛాతిపై తీవ్ర గాయం కావడంతో స్పృహ కోల్పోయింది.

కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను రాత్రి ఒంటిగంట తర్వాత ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే డ్యూటీ వైద్యుడు పరీక్షించి రాత్రి సుమారు 1.30 గంటలకు మాధవి మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కాట్రావత్‌ రాజుపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story