Ghatkesar: మహాకవి అందెశ్రీకి ఘన నివాళి.. ఘట్‌కేసర్‌లో 'స్మృతి వనం' ఏర్పాటు!

Ghatkesar: ప్రజాకవి అందెశ్రీ జ్ఞాపకార్థం ఘట్‌కేసర్‌లో రూ. 4 కోట్లతో 'అందెశ్రీ స్మృతి వనం' ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.

KARUNAKAR, UPPAL
Updated on: 10 Jun 2026 9:05 AM IST
Ghatkesar
X

Ghatkesar: మహాకవి అందెశ్రీకి ఘన నివాళి.. ఘట్‌కేసర్‌లో 'స్మృతి వనం' ఏర్పాటు!

ఘట్‌కేసర్: తెలంగాణ ఆత్మగౌరవాన్ని తన గేయాలతో ప్రపంచానికి చాటిన రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి దివంగత అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘట్‌కేసర్‌లో ప్రతిష్టాత్మకంగా ‘అందెశ్రీ స్మృతి వనం’ ఏర్పాటు చేయనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పక్కన ఉన్న సుమారు 1 ఎకరం 22 గుంటల స్థలంలో రూ.4 కోట్ల వ్యయంతో ఈ స్మృతి వనాన్ని అభివృద్ధి చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, గిరిజన, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అందెశ్రీ జీవిత విశేషాలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ప్రజల్లో చైతన్యం నింపిన గేయాలను భావితరాలకు పరిచయం చేసేలా స్మృతి వనాన్ని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన అందెశ్రీ 2025 నవంబర్ 10న కన్నుమూశారు. ఘట్‌కేసర్‌లో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై పాడె మోసి భావోద్వేగ నివాళులర్పించారు. ఆ సందర్భంగా "అందెశ్రీ స్మృతులను చిరకాలం నిలిపేలా అత్యద్భుతమైన స్మృతి వనాన్ని నిర్మిస్తాం" అని సీఎం ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీ కార్యరూపం దాల్చుతోంది.

అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ప్రజాగాయని విమలక్క తదితరులు పాల్గొని నివాళులర్పించారు. స్మృతి వనం నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ బి శాఖ రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించనున్నారు. తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ఊపిరిపోసిన మహాకవి అందెశ్రీ జ్ఞాపకాలను శాశ్వతంగా నిలబెట్టే ఈ స్మృతి వనం కేవలం ఒక పార్కుగా కాకుండా, తెలంగాణ చరిత్ర, సాహిత్యం, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story