Ghatkesar: ఘట్‌కేసర్ ఓఆర్ఆర్‌పై కమ్మేసిన దట్టమైన పొగ!
Ghatkesar: ఘట్‌కేసర్ పోచారం డంపింగ్ యార్డ్‌లో భారీగా పేరుకుపోయిన చెత్తను తగలబెట్టడంతో దట్టమైన పొగ కమ్ముకుంది.
Ghatkesar: ఘట్‌కేసర్ ఓఆర్ఆర్‌పై కమ్మేసిన దట్టమైన పొగ!
Ghatkesar: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్ కేసర్ సర్కిల్‌లో ఉన్న పోచారం డంపింగ్ యార్డ్‌లో భారీగా పేరుకుపోయిన చెత్తకు నిప్పంటించడంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకుపోయాయి. డంపింగ్ యార్డ్ నుంచి ఎగసిపడుతున్న పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి ప్రజలను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పొగ తీవ్రత అధికంగా ఉండటంతో ఘట్‌కేసర్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)తో పాటు సర్వీస్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దృశ్యమానత తగ్గిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా ప్రమాదాలు సంభవించే అవకాశాలు పెరిగాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్‌కు సమీపంలోనే ఓఆర్ఆర్ ఉండటంతో వేగంగా ప్రయాణించే వాహనాలకు పొగ ముప్పుగా మారింది. రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు.
ఇక పోచారం డంపింగ్ యార్డ్ సమస్య కొత్తది కాదని, గతంలోనూ స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని చెబుతున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసనతో పాటు తరచూ చెత్తను తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆరోపిస్తున్నారు.
డంపింగ్ యార్డ్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని అనేకసార్లు నిరసనలు, వినతిపత్రాలు సమర్పించినా ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్త దహనాన్ని అరికట్టడంతో పాటు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




