Ghatkesar: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. యన్నంపేటలో కూల్చివేతలు!
Ghatkesar: ఘట్‌కేసర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని యన్నంపేటలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.
Ghatkesar: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. యన్నంపేటలో కూల్చివేతలు!
ఘట్ కేసర్: మల్కాజిగిరి పురపాలక సంస్థ పరిధిలోని ఘట్ కేసర్ మున్సిపల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్టకేలకు కఠిన చర్యలు ప్రారంభించారు. యన్నంపేటలో అనుమతులు ఒక విధంగా తీసుకుని, నిర్మాణాలు మరొక విధంగా చేపడుతున్నారనే ఫిర్యాదులు వరుసగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ప్రారంభంలో ఫిర్యాదులపై అధికారులు కాలయాపన చేసినప్పటికీ, చివరకు అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ యన్నంపేటలో కూల్చివేతలు చేపట్టారు.
ఈ చర్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే యన్నంపేటతో పాటు ఘట్ కేసర్, పోచారం, వెంకటాపూర్, చౌదరిగూడ, జోడిమెట్ల, అన్నోజిగూడ, ఎదులాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా అనుమతి లేని షెడ్లు, అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై అధికారులకు వివిధ రూపాల్లో సమాచారం అందినప్పటికీ, ఇప్పటివరకు పెద్దగా చర్యలు తీసుకోకపోవడంపై అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నూతనంగా ఏర్పడిన మల్కాజిగిరి పురపాలక సంస్థ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రతి సర్కిల్ సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అక్రమ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం వహించడం అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా మున్సిపల్ సర్కిల్ కు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు అన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అరికట్టి, అభివృద్ధిపై దృష్టి సారించాలని స్థానికుల నుండి డిమాండ్ వ్యక్తమౌతుంది.




