Hyderabad: ఓయూలో గద్దరన్న 3వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాకవి గద్దరన్న 3వ వర్ధంతి సభ పోస్టర్‌ను విద్యార్థి సంఘాలు ఆవిష్కరించాయి.
Hyderabad: ఓయూలో గద్దరన్న 3వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ!
హైదరాబాద్: ప్రజాకవి గద్దరన్న 3వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 6న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యం, కోట శ్రీనివాస్ గౌడ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గద్దరన్న జీవితం, పాటలు, భావజాలం నేటి సమాజానికి ఎంతో ప్రాసంగికమని అన్నారు. ప్రజల సమస్యలను తన గానంతో దేశవ్యాప్తంగా వినిపించిన గొప్ప ప్రజా కళాకారుడిగా గద్దర్ నిలిచారని, అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన సాగించిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతులను అణిచివేసే ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో గద్దరన్న ఆలోచనలు, ప్రజల పక్షాన నిలిచిన ఆయన తత్వం మరింత అవసరమని తెలిపారు. యువత గద్దరన్న సందేశాన్ని అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 6న రవీంద్రభారతిలో నిర్వహించే గద్దరన్న 3వ వర్ధంతి సభకు విద్యార్థులు, యువజనులు, ప్రజాస్వామ్యవాదులు, కళాకారులు, రచయితలు, మేధావులు, పాత్రికేయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎల్. మూర్తి, ఆజాద్, సునీల్ శెట్టి, ఉదయ్, శ్రీకాంత్, ఎస్. నాగేశ్వర్ రావు, బద్రి, వలిగొండ నర్సింహా, రవీందర్ నాయక్, నామ సైదులు, అనిత, నెహ్రూ నాయక్, కాశీనాథ్, అవ్వరు వేణు, బాను, ఉస్మానియా ఫ్యాకల్టీ సభ్యుడు పర్షురామ్, మోడెం రవి తదితరులు పాల్గొన్నారు.




