Hayathnagar: ప్రజల ఆరోగ్యం పట్ల అధికారుల నిర్లక్ష్యం: నవజీవన్ రెడ్డి ధ్వజం
Hayathnagar: హయత్‌నగర్‌లోని కుమ్మరి కుంట దుస్థితిపై మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hayathnagar: ప్రజల ఆరోగ్యం పట్ల అధికారుల నిర్లక్ష్యం: నవజీవన్ రెడ్డి ధ్వజం
హయత్‌నగర్: హయత్‌నగర్‌లోని కుమ్మరి కుంట చెత్తాచెదారంతో నిండి, దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు అధికంగా పెరుగుతున్నాయని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుమ్మరి కుంటను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కుంటలో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి కారణంగా పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
తక్షణమే కుంటలోని చెత్తను పూర్తిగా తొలగించి, ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. కుంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికైనా స్పందించి అత్యవసర చర్యలు తీసుకోవాలని కళ్లెం నవజీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.




