Ghatkesar: ఘట్కేసర్ హోటళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
Ghatkesar: ఘట్కేసర్ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు. పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక.
Ghatkesar: ఘట్కేసర్ హోటళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఘట్ కేసర్: ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందుతున్నదా అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నీలీషా, ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్డబ్ల్యూఎం) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో కూడిన బృందం ఈ తనిఖీలు చేపట్టింది.
ఈ సందర్భంగా తులిప్స్ రెస్టారెంట్, ఆర్ రాయల్ బావర్చి, పరివార్ రెస్టారెంట్, అక్షీత్స్ తందూరి ఫ్యూజన్ ధాబాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంట పాత్రల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార తయారీ విధానంతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) నిబంధనల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా హోటల్ యాజమాన్యాలకు పలు సూచనలు జారీ చేసిన అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం ప్రతి హోటల్ యాజమాన్యం సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హోటల్ యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే జరిమానాలు కూడా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.




