Hyderabad: చిన్న గొడవ.. చిదిరిన సంసారం.. కార్ డ్రైవర్ బలవన్మరణం
Hyderabad: పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల పోచంపల్లిలో కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి.
Hyderabad: చిన్న గొడవ.. చిదిరిన సంసారం.. కార్ డ్రైవర్ బలవన్మరణం
Gundla Pochampally: పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి గుండ్ల పోచంపల్లిలో కుటుంబ కలహాలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన వెలుగుచూసింది. భార్యతో తరచూ జరుగుతున్న గొడవల కారణంగా మనస్తాపానికి గురైన కార్ డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గుండ్ల పోచంపల్లికి చెందిన నల్లూరి సాయికుమార్ (28), సత్యనారాయణ కుమారుడు, వృత్తిరీత్యా కార్ డ్రైవర్. సుమారు ఏడు సంవత్సరాల క్రితం అనుష (25)తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, ఒక బాబు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
వివాహం తర్వాత మొదటి ఏడాది వరకు దంపతులు సఖ్యంగా ఉన్నప్పటికీ, అనంతరం చిన్న చిన్న విషయాలపై విభేదాలు మొదలై తరచూ గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం జరిగిన ఘర్షణతో అనుష తన తల్లి ఇంటికి బహదూర్పల్లికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మే 5న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితుడికి వాట్సాప్ ద్వారా సందేశం పంపాడు. అనుమానం కలిగిన స్నేహితుడు ఇంటికి చేరుకుని చూడగా, సాయికుమార్ ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందినట్టు కనిపించాడు. స్థానికుల సమాచారం ప్రకారం, ఇంతకుముందు కూడా సాయికుమార్ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేయగా స్నేహితులు, చుట్టుపక్కల వారు కాపాడినటు తెలిసింది. భార్యాభర్తల మధ్య జరిగిన విభేదాల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




