Madhapur: మాధాపూర్‌లో ఈ-సిగరెట్ల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి!
Madhapur: మాధాపూర్ పీఎస్ పరిధిలోని స్మోక్ షాప్‌పై పోలీసులు, ఈగిల్ టీమ్ మెరుపు దాడి చేసి నిషేధిత ఈ-సిగరెట్లు, రూ.72,500 నగదును స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.
Madhapur: మాధాపూర్‌లో ఈ-సిగరెట్ల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి!
మాధాపూర్: చట్టవిరుద్ధంగా ఈ-సిగరెట్లు (వేప్స్) విక్రయిస్తున్న స్థావరంపై మాధాపూర్ పోలీసులు, ఈగిల్ (Eagle) టీమ్ మంగళవారం మెరుపు దాడి నిర్వహించి భారీగా నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాధాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 1762 సమీపంలోని “ది స్మోక్ షాప్” (The Smoke Shop) లో నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ఈగిల్ టీమ్ సోదాలు చేపట్టింది. ఈ దాడిలో షాప్‌లో పనిచేస్తున్న అబూబక్కర్ సిద్ధిఖ్ (26) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి వివిధ ప్రముఖ బ్రాండ్లకు చెందిన 17 ఈ-సిగరెట్లు/వేప్స్, పాడ్స్, కార్ట్రిడ్జ్‌లు, నికోటిన్ పౌచ్‌లతో పాటు అక్రమ విక్రయాల ద్వారా సమకూరిన రూ. 72,500 నగదు, రెండు మొబైల్ ఫోన్లు మరియు పేటీఎం QR కోడ్ వివరాలను పోలీసులు జప్తు చేశారు.
యాప్‌ల ద్వారా డెలివరీలు:
నిందితులు ఆర్డర్లను వాట్సాప్ ద్వారా స్వీకరించి, ఆన్‌లైన్ పేమెంట్లు తీసుకున్న అనంతరం రాపిడో, పోర్టర్ వంటి డెలివరీ యాప్‌ల ద్వారా కస్టమర్లకు వేప్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడి ఫోన్ పరిశీలించగా దీనికి సంబంధించిన సంభాషణలు, డిజిటల్ లావాదేవీలు లభ్యమయ్యాయి.
ఈ కేసులో షాప్ యజమాని అబ్దుల్ సఫ్వాన్, ఉద్యోగి సిద్ధిఖ్‌తో పాటు వీరికి ముడిసరుకు సరఫరా చేస్తున్న ముఠా పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్లకు వేప్స్ విక్రయించారా అనే కోణంలో పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. పరిధిలో నిషేధిత వేప్స్ అక్రమ విక్రయాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.




