Quthbullapur: కుత్బుల్లాపూర్ పరిధిలో సైబరాబాద్ సీపీ విస్తృత పర్యటన!
Quthbullapur: మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్. జగద్గిరిగుట్ట PS తనిఖీ, పోలీస్ పనుల సమీక్ష.
Quthbullapur: కుత్బుల్లాపూర్ పరిధిలో సైబరాబాద్ సీపీ విస్తృత పర్యటన!
Quthbullapur: మిలాద్ నబీ సందర్భంగా నిర్వహించనున్న ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, జగద్గిరిగుట్ట, సూరారం పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. ఊరేగింపు సాగే మార్గంలోని రహదారులు, ట్రాఫిక్ పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ, పోలీసు అధికారులతో సమావేశమై మిలాద్ నబీ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఊరేగింపు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
తదుపరి కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని సీసీఎస్, ఎస్‌ఓటీ కార్యాలయాలను సీపీ సందర్శించి, ఆయా విభాగాల పనితీరు, భద్రతా అంశాలు మరియు పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలపై అధికారులతో సమీక్షించారు.
అనంతరం గాజులరామారం ప్రాంతంలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకు పనులను సీపీ పరిశీలించారు. పెట్రోల్ బంకు ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీస్ కార్ హెడ్‌క్వార్టర్స్ కోసం నూతనం గా ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సీపీ పరిశీలించారు. అక్కడి పరిస్థితులను, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో చర్చించారు.
ఈ పర్యటనలో కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఎస్ ఓ టీ డీసీపీ శోభన్ కుమార్, సీ ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, కుత్బుల్లాపూర్ అదనపు డీసీపీ పురుషోత్తం, ఏసీపీ పబాల గంగిరెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.




