Uppal: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముస్తాబవుతున్న ఉప్పల్
Uppal: జూన్ 7న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు.
Uppal: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముస్తాబవుతున్న ఉప్పల్
ఉప్పల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) నూతన కార్యాలయ భవన నిర్మాణానికి జూన్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ భగాయత్‌లోని నిర్మాణ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సందర్శించి, భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ భూమిపూజ జరగనున్న స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అదే సమయంలో మూసీ ఒడ్డున ఎంఎంసీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం విశేషమని అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఎంఎంసీ నూతన భవనం నిర్మాణంతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని అన్నారు.
మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత సమస్యలు, అవసరాలపై పూర్తి అవగాహన ఉందని, ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. మూసీ నది ఒడ్డున నిర్మించనున్న ఈ భవనం ప్రాంత అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు, నూతన కార్యాలయ నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం కలుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
జూన్ 7న జరిగే భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకులు కోరారు. ఈ సమీక్ష సమయంలో ఉప్పల్, ఎల్‌బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




