Jawaharnagar: మేడ్చల్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో ఓపెన్ వర్సిటీ సెంటర్!
Jawaharnagar: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్టడీ సెంటర్ ప్రారంభం. సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేయాలని డీఐజీ పిలుపు.
Jawaharnagar: మేడ్చల్ సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో ఓపెన్ వర్సిటీ సెంటర్!
Medchal: చదువు మధ్యలో ఆపేసినవారు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు జవహర్‌నగర్‌లోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు సీఆర్‌పీఎఫ్ డీఐజీ డా. బి. వీర్రాజు తెలిపారు.
సీఆర్‌పీఎఫ్ మెన్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టడీ సెంటర్ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులను అభ్యసించే అవకాశం ఉందని తెలిపారు.
విద్యార్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో తరగతులు నిర్వహించడంతో పాటు బ్రౌ టీవీ, టీ-శాట్, దూరదర్శన్ ద్వారా కూడా పాఠాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. విధుల్లో అంగవైకల్యానికి గురైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు ఫీజులో రాయితీ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని డీఐజీ తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా సర్టిఫికెట్‌తో పాటు ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ కె. హరి శంకర్ – 9959034477, క్లర్క్ కళ్యాణి రెడ్డి – 7981837962ను సంప్రదించవచ్చన్నారు. వాట్సాప్ ద్వారా వివరాల కోసం 9441474923 నంబర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కో-ఆర్డినేటర్, సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కె. హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.




