Boduppal: బోడుప్పల్‌లో నీటి చుక్క కోసం నానా అవస్థలు.. జనం బేజారు!

Boduppal: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని అశోక్‌నగర్ మరియు పరిసర కాలనీల్లో తాగునీటి సమస్య పతాక స్థాయికి చేరింది.

KARUNAKAR, UPPAL
Published on: 16 May 2026 9:32 PM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్‌లో నీటి చుక్క కోసం నానా అవస్థలు.. జనం బేజారు!

బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నాలుగు, ఐదు రోజులకోసారి మాత్రమే సరఫరా అవుతున్న త్రాగునీరు కూడా తగిన వాటర్ ప్రెషర్ లేక ఇండ్ల ట్యాపులకు సరిగా చేరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అశోక్‌నగర్ ప్రాంతంతో పాటు పరిసర కాలనీల ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం, బోర్లలో నీరు లేకపోవడం, మరోవైపు నీటి సరఫరా తక్కువగా ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

బోడుప్పల్ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం, బోర్లు ఎండిపోవడంతో స్థానికులు ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు తాగునీరు కూడా సక్రమంగా రాకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పైపుల్లో వాటర్ ప్రెషర్ లేకపోవడంతో కొన్ని ఇళ్లలో ట్యాపులకు నీరు రావడం లేదని, మరికొన్ని చోట్ల సన్నటి ధారగా మాత్రమే వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇలా అయితే తాగునీరు ఎలా అంటూ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

వాడుక నీటికి ట్యాంకర్ల పై ఆధారపడాల్సి వస్తుండగా, తాగునీటికి కూడా అదనపు ఖర్చు చేయాల్సి రావడంతో ఇంటి యజమానులతో పాటు అద్దెకు ఉండే కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వాటర్ ప్రెషర్ పెంచి ప్రతి ఇంటికి సక్రమంగా మంచినీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story