Boduppal: బోడుప్పల్‌లో హైడ్రా రంగప్రవేశం.. పార్కు స్థలం రక్షణ
Boduppal: బోడుప్పల్ చెంగిచెర్ల క్రెసెంట్ నగర్‌లో కబ్జా నుంచి 1,160 గజాల పార్కు స్థలానికి రక్షణ కల్పించిన హైడ్రా. కాలనీవాసుల హర్షం.
Boduppal: బోడుప్పల్‌లో హైడ్రా రంగప్రవేశం.. పార్కు స్థలం రక్షణ
బోడుప్పల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల క్రెసెంట్ నగర్ (ఈసీఐఎల్ ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్) కాలనీలో కబ్జాకు గురవుతున్న 1,160 గజాల పార్కు స్థలానికి హైడ్రా రక్షణ కల్పించింది. పార్కు స్థలాన్ని కాపాడాలని కోరుతూ కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
సర్వే నంబర్లు 139, 134లో రూపొందించిన లేఅవుట్‌లో 1,160 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. గతంలో బోడుప్పల్ మున్సిపల్ అధికారులు సైతం ఆ స్థలాన్ని పార్కుగా గుర్తిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి పార్కు స్థలాన్ని ఆక్రమించి విక్రయించినట్లు కాలనీవాసులు ఆరోపించారు.
ఫిర్యాదుపై హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, 1,160 గజాల పార్కు స్థలాన్ని గుర్తించారు. అనంతరం హైడ్రా ఆధ్వర్యంలో స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. పార్కు స్థలాన్ని కొందరు తప్పుడు పత్రాలతో అమాయకులకు విక్రయించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
తెలియక స్థలాలు కొనుగోలు చేసిన కొందరు ఎల్‌ఆర్‌ఎస్ సైతం చెల్లించినట్లు సమాచారం. ఇళ్ల నిర్మాణానికి సిద్ధమయ్యే సమయంలో స్థలం పార్కు స్థలంగా తేలడంతో వారు అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా చర్యలతో పార్కు స్థలం కబ్జా నుంచి రక్షణలోకి రావడంతో క్రెసెంట్ నగర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.




