Boduppal: పార్కు స్థలాన్ని కాపాడండి.. 'హైడ్రా' కు కాలనీవాసుల విజ్ఞప్తి

Boduppal: బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల క్రెసెంట్ నగర్ కాలనీలో కోట్ల విలువైన పార్కు స్థలం కబ్జా యత్నంపై కాలనీవాసులు మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు.

KARUNAKAR, UPPAL
Published on: 17 July 2026 1:50 PM IST
Boduppal
X

Boduppal: పార్కు స్థలాన్ని కాపాడండి.. 'హైడ్రా' కు కాలనీవాసుల విజ్ఞప్తి

బోడుప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల క్రెసెంట్ నగర్ (ఈసీఐఎల్ ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్) కాలనీలో కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని కోరుతూ కాలనీవాసులు బోడుప్పల్ సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించి, పార్కు స్థలాన్ని పరిరక్షించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కాలనీవాసుల వివరాల ప్రకారం, సర్వే నంబర్లు 139, 134లో రూపొందించిన లేఅవుట్‌లో 1,160 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. గతంలో బోడుప్పల్ మున్సిపాలిటీ అధికారులు కూడా ఆ స్థలాన్ని పార్కుగా గుర్తిస్తూ బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ఇటీవల భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాల ఆధారంగా పార్కు స్థలాన్ని ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, అక్కడ నిర్మాణ పనులు చేపట్టేందుకు కూడా యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఆక్రమణల వల్ల ప్రజలకు ఉపయోగపడే ఏకైక బహిరంగ ప్రదేశం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్కు స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని, హద్దులను స్పష్టంగా గుర్తించి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను అడ్డుకునేలా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని బోడుప్పల్ సర్కిల్ అధికారులు, హైడ్రా అధికారులను కోరారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టపరమైన చర్యలు తీసుకుని పార్కు స్థలాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story