Boduppal: ఏసీబీ సోదాల్లో మైన్స్ ఏడీ జయరాజు అక్రమాస్తులు గుర్తింపు
Boduppal: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మైన్స్ అండ్ జియాలజీ ఏడీ బొజ్జ జయరాజు ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
Boduppal: ఏసీబీ సోదాల్లో మైన్స్ ఏడీ జయరాజు అక్రమాస్తులు గుర్తింపు
బోడుప్పల్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం వరంగల్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాల్లో గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో ఇప్పటివరకు రూ.3,06,53,177 విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. బోడుప్పల్‌లో రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం, కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్, కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేట ప్రాంతాల్లో ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు.
నగదు.. బంగారం.. వాహనాలు
సోదాల్లో రూ.10.03 లక్షల నగదు, ఎల్‌ఐసీ, మ్యాక్స్‌లైఫ్ పాలసీల్లో రూ.19.86 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కలిపి సుమారు రూ.40 లక్షల విలువైన వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. పోస్టాఫీసు పొదుపు ఖాతాల్లో రూ.20.86 లక్షలు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు సుమారు రూ.37.23 లక్షల విలువైనవిగా గుర్తించారు. మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది.
డ్రైవర్ ఖాతా నుంచి బదిలీ
అధికారి డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా కీలక వివరాలు వెలుగుచూశాయి. డ్రైవర్ ఖాతా నుంచి జయరాజు కుమార్తె ఖాతాకు పలు విడతల్లో రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ఏసీబీ గుర్తించింది. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి బదిలీ చేసినట్లు డ్రైవర్ తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ లావాదేవీల వెనుక ఉన్న మూలాలు, ఉద్దేశం, అక్రమ ప్రయోజనాలకు సంబంధం ఉందా అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని ఆస్తులు ఉన్నాయా? వాటికి సంబంధించిన నిధుల మూలాలేమిటన్నదీ పరిశీలిస్తున్నారు. గుర్తించిన స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల్లో నమోదైన విలువ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ తెలిపింది. ఏసీబీ అధికారులు జయరాజ్ ను కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నట్లు ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.




