Maheswaram: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎంనిరసన

Maheswaram: మహేశ్వరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపి, ఆగస్టు 15లోపు రూ.15 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.

K Sai, Maheswaram
Published on: 8 Aug 2026 5:59 PM IST
Maheswaram
X

Maheswaram: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎంనిరసన

మహేశ్వరం:

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని శారద ఒకేషనల్ కాలేజీ విద్యార్థులతో కలిసి భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో BJYM రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మునావత్ దేవేందర్ నాయక్, ముయ్యాడ శివ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం BJYM రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహేశ్వరం మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆగస్టు 15లోపు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిల మొత్తాలను నమోదు చేస్తూ వారి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు BJYM ఆధ్వర్యంలో సుమారు 1,50,000 మంది విద్యార్థుల సంతకాలను సేకరించినట్లు వెల్లడించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించిన కీలక బాధ్యతలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, MEO, DEO పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే BJYM ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై మరింత పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో BJYM నాయకులు శివ, రాహుల్, అభిలాష్, కె. సాయి తదితరులు, శారద ఒకేషనల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story