Uppal: ఉప్పల్ గళం: సీఎం పర్యటనలో సమస్యలను విస్మరించారు.. బీజేపీ పోరుబాట!

Uppal: ఉప్పల్ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారంటూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ 'ప్రజా పోరు' దీక్ష.

KARUNAKAR, UPPAL
Published on: 10 Jun 2026 12:42 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్ గళం: సీఎం పర్యటనలో సమస్యలను విస్మరించారు.. బీజేపీ పోరుబాట!

ఉప్పల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి వెళ్లినా, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఒక్క స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టిన “ప్రజల కోసం – ప్రగతి కోసం” ప్రజా పోరు దీక్ష ఉప్పల్ రింగ్ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఉప్పల్ ప్రజల ఎన్నో ఏళ్ల డిమాండ్లు పూర్తిగా విస్మరించబడ్డాయని విమర్శించారు. కేవలం శంకుస్థాపనలు, సభలకే పరిమితమైన ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో పాటు, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. అలాగే దశాబ్దాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

నియోజకవర్గంలోని పలు బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణకు ఒక్క రూపాయి నిధి కూడా ప్రకటించలేదని విమర్శించారు. ఉప్పల్ భాగాయత్ భూ యజమానుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం, ఉప్పల్ బస్ టెర్మినల్ నిర్మాణంపై కనీస ప్రకటన కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో మంచినీటి సరఫరా సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అంతర్గత రహదారుల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. అలాగే చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఇప్పటి వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు సంబంధించిన ఈ కీలక అంశాలన్నింటినీ పక్కనపెట్టి కేవలం ప్రచార కార్యక్రమాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించిన ప్రభాకర్, ఉప్పల్ అభివృద్ధి కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story