Pocharam: నిషేధిత ఇంజెక్షన్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్!
Pocharam: పాల ఉత్పత్తి పెంచే నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న రంగయ్య యాదవ్‌ను పట్టుకున్న ఎస్‌వోటీ ఉప్పల్ పోలీసులు. పోచారంలో కేసు నమోదు.
Pocharam: నిషేధిత ఇంజెక్షన్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్!
Pocharam: పాల ఉత్పత్తిని కృత్రిమంగా పెంచేందుకు వినియోగించే నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్‌వోటీ ఉప్పల్ బృందం పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి మక్తా గ్రామంలో నిర్వహించిన దాడుల్లో నిందితుడు ముంత రంగయ్య యాదవ్ (56)ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి ఐదు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
మక్తా గ్రామానికి చెందిన ముంత రంగయ్య యాదవ్ వాటర్ ప్లాంట్ వ్యాపారం నిర్వహిస్తూ, నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పాలిచ్చే పశువుల్లో పాల ఉత్పత్తిని కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల తయారీ, నిల్వ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఇంజెక్షన్ల వినియోగం వల్ల పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా, ఆ పాలను వినియోగించే ప్రజల ఆరోగ్యానికీ హానికరమైన ప్రభావాలు కలిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్‌వోటీ ఉప్పల్ బృందం నిర్వహించిన దాడుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ సీసాలను పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.




