నాపై కొందరు కుట్రలు పన్నుతున్నారు: బండి సంజయ్
నన్ను నేరుగా ఎదుర్కోలేక కొందరు కుట్రలు పన్నుతున్నారు. బెదిరింపులకు భయపడి పారిపోవడానికి నేను ఫామ్‌హౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సనాతన ధర్మం, రాష్ట్ర అభివృద్ధి, , రాజకీయ కుట్రలపై ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
పోరాటం ఆగేది లేదు
భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ.. ‘జై శ్రీరామ్’ అనే నినాదం వింటేనే కాంగ్రెస్ నాయకులు భయంతో వణికిపోతున్నారని విమర్శించారు. "జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా?" అని హేళన చేసే వారికి కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇదే నినాదం రాజకీయ మార్పుకు ఎలా నాంది పలికిందో గుర్తు చేస్తూ, తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆరు గ్యారంటీల విఫలం - రైతుల గోస
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సంజయ్ ఆరోపించారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. హామీల అమలును గాలికొదిలేసి, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ధ్యేయమని ధ్వజమెత్తారు.
కేంద్ర నిధులే రాష్ట్రానికి ఆధారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్రం ఇచ్చే నిధులతోనే మనుగడ సాగిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. "కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర పాలన సాగే పరిస్థితి లేదు. మేము రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు పంపిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు ఆ నిధులను ఢిల్లీకి మళ్లించి తమ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుంటున్నారు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు
రాజకీయ ప్రత్యర్థులు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. "నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అయినందుకు గర్వపడుతున్నాను. పార్టీ తలవంచుకునే పని ఎన్నడూ చేయలేదు. నన్ను నేరుగా ఎదుర్కోలేక కొందరు కుట్రలు పన్నుతున్నారు. బెదిరింపులకు భయపడి పారిపోవడానికి నేను ఫామ్‌హౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు" అని ఘాటుగా స్పందించారు. పార్టీ నాయకులందరూ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి, పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




