Balkampet: బల్కంపేట రథోత్సవం జాప్యంపై కోట నీలిమ తీవ్ర ఆగ్రహం

Balkampet: ఎమ్మెల్యే కోసమని బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం ఆలస్యం చేయడం కుట్రేనని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ మండిపడ్డారు. తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్.

RAJESH,	WEST ZONE
Published on: 23 July 2026 3:24 PM IST
Balkampet
X

Balkampet: బల్కంపేట రథోత్సవం జాప్యంపై కోట నీలిమ తీవ్ర ఆగ్రహం

బల్కంపేట: కేవలం ఒక్క వ్యక్తి కోసం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవాన్ని నిర్ణయించిన ముహూర్తానికి ప్రారంభించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, సాక్షాత్తూ ఎల్లమ్మ తల్లినే నిరీక్షించే పరిస్థితి కల్పించడం ద్వారా లక్షలాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ కోట నీలిమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రథోత్సవం ప్రారంభంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆలయ అధికారులు, పూజారులను ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాకమ్మ కబుర్లు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ... రథోత్సవాన్ని నిర్ణయించిన శుభ ముహూర్తానికి కాకుండా స్థానిక ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే ప్రారంభించడం వల్ల వేలాది మంది భక్తులు వర్షంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక వ్యక్తి కోసం వేలాది మంది భక్తులను వేచి ఉండేలా చేయడమే కాకుండా, అమ్మవారి ఉత్సవాన్ని కూడా ఆలస్యం చేయడం ద్వారా భక్తుల విశ్వాసాలను, ఆధ్యాత్మిక మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని అన్నారు.

దేవాలయ కార్యక్రమాలు సంప్రదాయాలు, శాస్త్రోక్త విధానాలు, నిర్ణయించిన ముహూర్తాల ప్రకారమే జరగాలని, ఏ ఒక్క వ్యక్తి కోసం వాటిని నిలిపివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలనే చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో కొందరు పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని ఆరోపించారు.

ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి రావాలని, ఈ కుట్రలో ఎవరు భాగస్వాములయ్యారో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసి, పూర్తి స్థాయి విచారణ జరిపించి కుట్ర బాగోతాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.

వ్యక్తుల కోసం దేవుళ్లనే నిరీక్షింపజేసే పరిస్థితి తీసుకురావడం ముమ్మాటికీ క్షమించరాని, అత్యంత సిగ్గుచేటైన చర్య అని డాక్టర్ కోట నీలిమ పునరుద్ఘాటించారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్లకు, కోట్లాది మంది భక్తులకు ఆలయ ముఖద్వారం వద్ద బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story