Shahbad: షాబాద్ ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక సేద్యంపై శిక్షణ

Shahbad: షాబాద్‌లో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆర్.పి.ఎల్ శిక్షణ. పత్తి, వరి పంటల్లో తెగుళ్ల నివారణ, ప్రకృతి వ్యవసాయంపై ఏఓ విజయాచంద్ర అవగాహన.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 19 Aug 2026 6:32 PM IST
Shahbad
X

Shahbad: షాబాద్ ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక సేద్యంపై శిక్షణ

షాబాద్: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) మరియు వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆర్.పి.ఎల్ ఆధారిత 2వ రోజు శిక్షణ కార్యక్రమం. మండల వ్యవసాయ అధికారి, దండెం విజయచంద్ర మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని, ముఖ్యంగా పత్తి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి వివరిస్తూ, పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను సిఫారసు కంటే ఎక్కువగా వేస్తున్నారని తెలిపారు.

సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటిస్తే పత్తి పంటలో అధిక దిగుబడి మరియు లాభం పొందవచ్చని తెలిపారు. అలాగే వరి పైర్లు ఇప్పుడు ఎక్కువ శాతం పిలక దశలో ఉన్నాయి. నాటిన 15-20 రోజులకు రెండవ దఫాగా ఎకరానికి వేసే 20 కిలోల యూరియాతో పాటు 100 గ్రాముల కార్బెండాజిమ్ 25శాతం + మాంకోజెబ్ 50శాతం మిశ్రమ శిలీంద్రనాశిని కూడా కలిపి బురద పొలంలో సమానంగా చల్లుకోవాలి.

కొన్ని ప్రాంతాల్లో జింక్ లోపం వల్ల ఆకుల మీద త్రూప్పు రంగు మచ్చలు ఏర్పడి మొక్కలు ఎదుగుదల లోపిస్తున్నాయి. ముఖ్యంగా చౌడు భూముల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో ఒకవేళ గుళికలు వేయకపోతే, 20-25 రోజుల వయసున్న పిలకదశలో ఉన్న వరి పైరులో ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోలు 25 కిలోల ఇసుకతో కలిపి సమానంగా చల్లాలి. అగ్గితెగులు గమనించినట్లయితే నివారణకు ఐసోప్రోథయోలెన్ 1.5 మీ.లీ లేదా ట్రైసైక్లోజోల్ + మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకుమచ్చ దశలోనే ఈ తెగుళ్ళను నివారించుకోవాలి లేకపోతే మెడవిరుపు ఆశించి అధిక నష్టం కలిగించే అవకాశం ఉందని రైతులు గమనించాలి. రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ గోమూత్రం, భూమయం వంటి సహజ వనరులను ఉపయోగించి జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం వంటి ద్రావణాలను తయారు చేసి పంటలకు వినియోగిస్తే నేల సారం పెరిగి పంట ఆరోగ్యంగా పెరుగుతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం కాపాడడంతో పాటు రైతుల ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు - శివతేజ, మౌనిక, రాజేశ్వరి, బాబ్య నాయక్, శైలజ, శివ కుమార్, మరియు వివిధ గ్రామాల రైతులు సత్యనారాయణ రెడ్డి, మాధవి, మమత, లింగాల సత్యం, శివ కుమార్, సూర్యప్రకాష్ రెడ్డి ఇతర రైతులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story