Vikarabad: తహసిల్దార్ నిర్లక్ష్యం ఆరోపణలు.. హైకోర్టు ఆదేశాల అమలు లేదు
Vikarabad: వికారాబాద్ దౌల్తాబాద్‌లో తహసిల్దార్‌పై ఆరోపణలు. హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదని న్యాయవాది విమర్శలు.
Vikarabad
Vikarabad: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో తహసిల్దార్ వ్యవహారంపై వివాదం నెలకొంది. గుండాల గ్రామానికి చెందిన పేద రైతు మొగలమడక నరసమ్మకు న్యాయం జరగకుండా తహసిల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సర్వే నంబర్ 704లో ఉన్న భూ సమస్యను పరిష్కరించాలని 2024 జనవరిలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. నోటీసులు సకాలంలో ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం న్యాయస్థానానికి అవమానమని ఆయన వ్యాఖ్యానించారు. తహసిల్దార్‌పై విశ్వాసం లేదని, ఈ కేసును వేరే అధికారికి అప్పగించి విచారణ జరిపించాలని జిల్లా కలెక్టరేట్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
అలాగే తహసిల్దార్ కార్యాలయంలో పహాని, ఆర్ఓఆర్, రిజిస్ట్రేషన్ పనుల కోసం అధిక మొత్తంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా, స్థానిక ఎమ్మార్వోను వివరణ కోరగా, విచారణ సకాలంలోనే నిర్వహించామని, నోటీసులు కూడా పంపించామని తెలిపారు. త్వరలోనే తుది ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు.




