Secunderabad: నీట్ లీకేజీపై సీతాఫల్‌మండిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ

Secunderabad: రాహుల్ గాంధీ పట్ల పోలీసుల తీరును ఖండిస్తూ ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సీతాఫల్‌మండిలో కాంగ్రెస్ శాంతియుత ర్యాలీ. కేంద్రంపై సంతోష్ ధ్వజం.

Srikanth, Secunderabad
Published on: 23 July 2026 4:15 PM IST
Secunderabad
X

Secunderabad: నీట్ లీకేజీపై సీతాఫల్‌మండిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ

సికింద్రాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద NEET-UG ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనకు సంఘీభావం తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ, సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం సీతాఫల్మండి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.

అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాహుల్ గాంధీ పై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ, NEET-UG ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అన్నారు. పేపర్ లీకేజీలకు కారణమైన అసలు సూత్రధారులను గుర్తించి ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

వైద్య విద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి చదువుతున్నారని, తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ ఇప్పిస్తున్నారని తెలిపారు. రాత్రింబవళ్లు శ్రమించి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల జీవితాలతో కొందరు అక్రమాలకు పాల్పడుతూ చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షలు పదేపదే రద్దు కావడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తల్లిదండ్రులు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై పోలీసులు బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, NEET-UG ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని ఆదం సంతోష్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో రాజేందర్ యాదవ్, శిల్పాచారి, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఘటనల పై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story