LB Nagar: తహసీల్దార్ అక్రమ ఆస్తుల చిట్టా బయటకు.. ఏసీబీ భారీ సోదాలు!
LB Nagar: రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ దాసరి శ్రీనివాస్‌రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
LB Nagar: తహసీల్దార్ అక్రమ ఆస్తుల చిట్టా బయటకు.. ఏసీబీ భారీ సోదాలు!
ఎల్బీనగర్: అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తహసీల్దార్ దాసరి శ్రీనివాస్‌రెడ్డి కి చెందిన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం లోని తన ఇంటిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి భారీ సోదాలు చేపట్టారు.
రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి, అక్రమంగా డబ్బు, ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు అందాయి.
ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు.. డీజీ అనుమతి తీసుకుని ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఆయన నివాసంతో పాటు ఏకకాలంలో సుమారు 7 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో బయటపడుతున్న ఆస్తుల చిట్టా
సోదాల్లో భాగంగా ఇప్పటివరకు సుమారు 8 ఓపెన్ ప్లాట్లు గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు.
* తుర్కయంజాల్‌లో – 3 ఓపెన్ ప్లాట్లు
* యాదగిరిగుట్టలో – 3 ఓపెన్ ప్లాట్లు
* హస్తినాపురంలో – 1 ఓపెన్ ప్లాట్
* విశ్వేశ్వర నగర్ కాలనీలో – 1 ఓపెన్ ప్లాట్
వీటితో పాటు మరిన్ని ఆస్తులు, నగదు, విలువైన వస్తువులపై ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
రూ.6.66 కోట్ల ఆస్తులు గుర్తింపు.. మార్కెట్ విలువ భారీగా ఉండే అవకాశం!
ఇప్పటివరకు రికార్డుల ప్రకారం సుమారు రూ.6.66 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు కూడా గుర్తించినట్లు తెలిపారు.
అయితే రిజిస్ట్రేషన్/రికార్డు విలువతో పోలిస్తే మార్కెట్ విలువ భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆస్తుల విలువ రూ.70 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అవినీతిపై ఫిర్యాదు చేయండి.. ఏసీబీ నంబర్ 1064
ప్రభుత్వ ఉద్యోగి తన విధుల్లో భాగంగా చేయాల్సిన పని కోసం లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు. లంచం అడిగినా.. అవినీతికి పాల్పడినా.. వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




